ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలన్న నిర్ణయంపై అసెంబ్లీలో నానా రచ్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీ స్థాపించేందుకు కృషి చేసిన అన్నగారి గౌరవార్థం దానికి ఎన్టీఆర్ పేరు పెట్టారని, దానికి వైఎస్సార్ పేరు పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయించడం ఏమిటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో దానికి సంబంధించిన బిల్లు కూడా ప్రవేశపెట్టడంతో నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు…సస్పెన్షన్ కి కూడా గురయ్యారు.
ఈ క్రమంలోనే అనూహ్యంగా ఈ పేరు మార్పు వ్యవహారంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జగన్ ను వంశీ కోరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని జగన్ కు వంశీ సభలో విన్నవించడం హాట్ టాపిక్ గా మారింది.
పెద్ద మనసుతో ఎన్టీఆర్ జిల్లాను జగన్ ఏర్పాటు చేశారని, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చరిత్రాత్మక నిర్ణయం అని, విప్లవత్మకమని వంశీ అన్నారు. ఎన్టీఆర్ చొరవతోనే హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు అయిందని, అందుకే ఆ యూనివర్సిటీకి ఆయన పేరే కొనసాగించాలని వంశీ కోరారు. అయితే, ఇన్నాళ్లు ఎన్టీఆర్ పై తమకు అభిమానం ఉందంటూ వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారని, తాజాగా ఈ పేరు మార్పు వ్యవహారంతో అదంతా బూటకం అని తేలిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
కేవలం ఒక సామాజిక వర్గాన్ని బుజ్జిగించేందుకే కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, అదంతా రాజకీయమని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజంగా ఎన్టీఆర్ పై అంత ప్రేమ ఉంటే ఆల్రెడీ ఉన్న పేరును ఎందుకు తొలగించాలనుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ అంటే వైసీపీ నేతలకు అభిమానం లేదని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు.