అహంకారం పాలకుల పదవులను పోగొడుతుంది. చరిత్ర దీనిని అనేక సార్లు నిరూపించింది. ఇపుడు మరోసారి నిరూపించనుందనడంలో పెద్ద విచిత్రం ఏం లేదు. రైతుకు పొలం అంటే ప్రాణం. పొలం వదులుకోవడం కంటే ప్రాణం వదులుకోవడం మేలనుకుంటాడు రైతు. అలాంటి పొలం ప్రభుత్వం తీసుకుని తాను ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే …. తనను మోసం చేస్తే… అయ్యా నన్ను మోసం చేయొద్దు, నీకాళ్లు పట్టుకుంటాం అని బతిమాలాలా? సామాన్యులను పాలకులను చేసేది రైతులు, ప్రజలే. వారికి కోపం తెప్పిస్తే, వారిని అసహనానికి గురిచేస్తే కాలం ఊరుకోదు.
చంద్రబాబు మీద రాజకీయ పగ తో అమరావతికి భూములు ఇచ్చిన 29 వేల రైతు కుటుంబాల మీద, ఆ ప్రాంతంలో ఉన్న లక్ష ఇతర కుటుంబాల మీద పగబట్టి రాజధానినే మార్చేస్తాం.. ఏం చేస్కుంటారో చేసుకోండి అంటూ ముఖ్యమంత్రి జగన్ మొండికేశారు. దీంతో రైతులు తిరగబడ్డారు.
అమరావతి కోసం దాదాపు 270 రోజులుగా నిరవధిక పోరాటాలు చేస్తున్నారు. చివరకు ప్రభుత్వంతో చర్చలకు రండి అని రైతులను ప్రభుత్వంలోని పెద్దలే అడిగారు గానీ ఏనాడూ ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రం ఇవ్వడానికి కూడా రైతులు ఒప్పుకోలేదు. మా పొలం మా హక్కు. రాజధాని ఆంధ్రుల హక్కు అంటూ పోరాటం చేస్తున్న వారికి ఆత్మాభిమానం లేకుండా తన నియోజకవర్గం ప్రజలను మోసం చేసిన పార్టీ మారిన ఎమ్మెల్యే బోడి సలహా ఇచ్చారు.
రాజధాని విషయంలో రైతులు కోర్టులకు వెళ్ళేబదులు ప్రభుత్వంతో చర్చలు జరపాలట. రాజధాని నిర్మాణం అన్నది అమరావతిలో జరిగే పనికాదట. లక్ష కోట్లతో రాజధాని నిర్మించటానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవట. రైతులు ఇక ఆ ఆశలు వదిలేసుకోవాల్సిందేనట. ఇది జంప్ జిలానీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉచిత సలహా.
తన మేధావితనంతో రైతులకు ఆయన ఒక సలహా కూడా ఇచ్చారు. రాజధాని నిర్మాణం బదులు మెగా టౌన్ షిప్పు నిర్మిస్తే అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందట. మెగా టౌన్ షిప్పు నిర్మాణానికి రైతులు ఓకే అంటే..తానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో మాట్లాడి రైతులను రక్షిస్తారట. టౌన్ షిప్పును నిర్మించినా రైతుల భూములకు మంచి ధరలు వస్తాయట. రాజధాని నిర్మిస్తేనే తమ భూములకు ధరలు వస్తాయనే భ్రమల్లో ఉండొద్దట.
వల్లభనేని వంశీ ఎవరు? అధికార పార్టీ ఎమ్మెల్యేనా? కాదే. స్వయంగా అమరావతి ప్రాంతం ఎమ్మెల్యే అయిన రామకృష్ణారెడ్డి (ఈయన ఎవరో కాదు జగన్ కి ఫండింగ్ ఇచ్చే అయోధ్యరామిరెడ్డి సోదరుడు) అమరావతి మారదు. నేను జగనన్నతో మాట్లాడుకుంటా అంటూ మోసం చేశాడు.
వైకాపాలో ప్రతి ఒక్కరు అమరావతి మారదు అని రైతులను మోసం చేశారు. అధికారం రాగానే నాలుక మడతేశారు. ఇక జగన్ రెడ్డే మాట తప్పి మడమ తిప్పితే… ఈ జంపింగ్ ఎమ్మెల్యే మాట వినాలా? చెప్పేముందు ఒకసారి తన స్థాయేమిటో తెలుసుకోవాలి. తాను నియోజకవర్గ ప్రజలకు చేసిన మోసమేంటో తెలుసుకోవాలి.
తన మెగా టౌన్ షిప్పు నిర్మాణానికి రైతులు ఎలా అంగీకరిస్తారని ఎంఎల్ఏ అనుకున్నారో అర్ధం కావటం లేదు. కష్టమైనా, నష్టమైనా రైతులు న్యాయాన్నే నమ్ముకున్నారు. ఈ వ్యవస్థలో ప్రభుత్వం సుప్రీం కాదు. రాజ్యాంగం సుప్రీం. వేల మంది జీవితాలను చిదిమేసి నచ్చింది చేస్తామంటే కోర్టులు ఊరుకోవు. ముందు ఆ టౌన్ షిప్ ఏదో కట్టి… చూశారా మీకు మేలు చేయడానికి మేము ఎంత పనిచేశామో అని నిరూపించుకుంటే అపుడు రైతులు చర్చలకు వస్తారేమో. అంతేగానీ అగ్రిమెంటుకే విలువవ్వని పాలకుల హామీలను వింటారా రైతులు. రైతులు కోర్టుల్లో గెలిచే అవకాశం ఉంది కాబట్టే… మెల్లగా వారి గడ్డాలు పట్టుకోవడానికి జగన్ రెడ్డి సర్కారు రకరకాల ప్లాన్లు వేస్తోంది.
అమరావతి ఇంచు కూడా ఎక్కడికి కదిపే శక్తి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే రైతులకు ప్రభుత్వం రాతపూర్వక అగ్రిమెంటు చేసిచ్చింది.