టాలీవుడ్లో త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ సహా ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు రైటింగ్ బ్యాగ్రౌండ్ వచ్చిన వాళ్లే. వక్కంతం వంశీ కూడా ఈ కోవలోకి చేరాలని ఆశపడ్డాడు. కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో రచయితగా అతనికి మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ తో దర్శకత్వ అరంగేట్ర చిత్రానికి రంగం సిద్ధం చేసుకున్నాడు వంశీ. కానీ అనివార్య కారణాలవల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
అయినా నిరాశ చెందకుండా కొన్నేళ్లు కష్టపడి అల్లు అర్జున్ ను ఒప్పించి నా పేరు సూర్య చిత్రాన్ని పట్టాలెక్కించాడు. కానీ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఆ ప్రభావం వంశీ కెరీర్ మీద గట్టిగానే పడింది. రచయితగా ముందున్న వైభవం పోయింది. దాంతో పాటే దర్శకుడుగానూ కొత్తగా అవకాశాలు రాలేదు. తొలి సినిమా తర్వాత నాలుగేళ్లకు కానీ ఇంకో ఛాన్స్ అందుకోలేకపోయాడు. అది కూడా బన్నీ లాంటి టాప్ స్టార్ సినిమా తర్వాత నితిన్ లాంటి మిడ్ రేంజ్ హీరోకి పడిపోయాడు.
అయితే ఏ స్థాయి సినిమా అన్నది పక్కన పెడితే మంచి హిట్ పడితే అదే చాలు అనుకున్నాడు వంశీ. కానీ అతడి ఆశ నెరవేరలేదు. నితిన్ తో అతను తీసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. తొలిరోజు ఓపెనింగ్స్ వరకు పరవాలేదు అనిపించిన ఈ చిత్రం తర్వాత చతికిల పడింది. వీకెండ్ అయ్యాక సినిమా గురించి చర్చ లేదు. సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. నా పేరు సూర్య చిత్రం రచయితగా, దర్శకుడిగా వంశీకి కొంచెం పేరైనా తెచ్చిపెట్టింది. కానీ ఎక్స్ట్రా తో ఆ మాత్రం ప్రయోజనం కూడా దక్కలేదు. దర్శకుడిగా పెద్ద ఫెయిల్యూర్ అన్న ముద్ర పడిపోయింది వంశీపై.
నా పేరు సూర్య తర్వాత అతడికి దర్శకుడిగా ఇంకో సినిమా దక్కించుకోవడానికి నాలుగేళ్లకు పైగానే టైం పట్టింది. మరి ఈసారి మరో సినిమా చేయడానికి వంశీకి ఎన్నేళ్లు సమయం పడుతుందో చూడాలి. పోనీ రచయితగా అయినా కొనసాగుదాం అనుకుంటే కిక్ -2, ఏజెంట్ చిత్రాలతో అక్కడ కూడా పేరు దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇకపై ఎలా సర్వైవ్ అవుతాడో చూడాలి.
డైరెక్టర్ ధనుష్ సూపర్ ఫాస్ట్
తమిళ స్టార్ హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞ గురించి అందరికీ తెలిసిందే. అతను కేవలం నటుడు మాత్రమే కాదు. గాయకుడు, గేయ రచయిత, రచయిత దర్శకుడు కూడా. ఈ విభాగాలు అన్నిట్లో ఇప్పటికే గొప్ప ప్రతిభ చాటుకున్నాడు. దర్శకుడిగా తన డెబ్యూ మూవీ పవర్ పాండి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తోపాటు మంచి వసూళ్లు కూడా సాధించి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత రుద్ర పేరుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలనుకున్నాడు ధనుష్. అందులో మన సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్ర చేయాల్సింది. కానీ బడ్జెట్ సమస్యలతో ఆ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది. తర్వాత కొన్నేళ్లు డైరెక్షన్ గురించి ఆలోచించనేలేదు ధనుష్.