ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు..?
మోదీ ఆయనపై మనసుపడి ‘నా కేబినెట్లో మీ వాళ్లకు మూడు మంత్రి పదవులు ఇస్తాను రా బ్రదరూ!’ అని పిలిస్తే వెళ్తున్నారు.
నిన్నటి నుంచీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే విషయం.. కొందరైతే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా విజయసాయిరెడ్డికి ఏ శాఖ ఇస్తారు.. మిథున్ రెడ్డికి ఏ శాఖ ఇస్తారు.. నందిగం సురేశ్‌కు ఏ శాఖ ఇస్తారో కూడా విశ్లేషించేస్తున్నారు.
అయితే, నిజంగా అంత సీనుందా అంటే దిల్లీ బీజేపీ వర్గాలు మాస్కుపై నుంచి కూడా కనిపించేలా పెదవి విరుస్తున్నాయి.
పెదవి విరవడమే కాదు బిహార్ ఎగ్జాంపుల్ చెబుతున్నాయి. ఆ కథ తెలియకపోతే ఒకసారి చూడండి.. జేడీయూ, ఆర్జేడీలు కలిసి బిహార్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత కొన్నాళ్లుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తన తెలివితేటలంతా ఉపయోగించి బీజేపీకి ఒక బేరం పెట్టారు. మీరు కనుక మాతో కలిస్తే నితీశ్ కుమార్‌ను పక్కన పెట్టి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం.. నా కొడుకును సీఎం చేస్తాను అని మోదీ-అమిత్ షాలకు ప్రపోజల్ పంపించారట..
అయితే.. గడ్డి కుంభకోణం నుంచి నానా కేసుల్లో ఉన్న లాలూతో కలిస్తే ఉన్న మర్యాద పోతుందన్న ఉద్దేశంతో మోదీ-షాలు ఈ సంగతి నితీశ్‌కు చేరవేశారు. కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది.. ఆర్జేడీని బయటకు తన్నేసి నితీశ్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ కథలో నీతి ఏంటంటే… నితీశ్ వంటి నిఖార్సయిన నేత ఉండగా బీజేపీ మెడ చుట్టూ ఉన్న కేసులు బిగుసుకున్న లాలూతో కలవరు.
ఇక ఏపీ విషయానికొస్తే జగన్మోహనరెడ్డి పార్టీ వైసీపీని ఇప్పటికిప్పుడు ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. శిరోమణి అకాలీదళ్ స్థానంలో వైసీపీని తీసుకుంటారన్నది ఒట్టి ప్రచారమేనంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎందుకుంటే వ్యవసాయ బిల్లులతో విభేదించి బీజేపీని వదిలివెళ్లిన శిరోమణి అకాలీదళ్ కేవలం రాజకీయ కారణంతోనే వదిలి వెళ్లింది కానీ బీజేపీతో ఉన్న మంచి సంబంధాలేమీ పోలేదు. పైగా శిరోమణి అకాలీదళ్‌కు ఉన్నవి రెండు సీట్లే. కాబట్టి ఎన్డీయే బలమేమీ తగ్గిపోలేదు.
మరి… జగన్ ఢిల్లీ టూర్ ఎందుకు అంటే ఏపీలోని విపక్షాలు సమాధానం చెబుతున్నాయి. రాజకీయ నాయకులపై కేసులు త్వరితగతిన విచారించాలని సుప్రీం ఆదేశించడంతో భయంతో జగన్ కేంద్రం సాయం కోసం వెళ్లారని టీడీపీ అంటోంది. ఆ వాదనను అడ్డుకోవడానికే వైసీపీ ఇప్పుడు ఈ మంత్రి పదవుల విషయం ప్రచారం చేసుకుంటోందని చెబుతున్నారు. ఇంతకుముందు జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇలాంటి ప్రచారమే జరిగింది. అయితే.. అలా మోదీ మంత్రి పదవులు ఇవ్వడానికి పిలిచారని ప్రచారం జరిగిన సందర్భాలలో కూడా జగన్‌కు మోదీ కాదు కదా అమిత్ షా అపాయింట్మెంటు కూడా దొరక్క వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చేసిన సందర్భాలున్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
ఇక అసలు విషయానికొస్తే బీజేపీ జగన్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు కనిపిస్తున్నా అది రాబోయే జమిలి ఎన్నికల వరకే. ఎక్కడైనా బావ కానీ వంగ తోట దగ్గర కాదన్నది బీజేపీ పాతివ్రత్య సిద్ధాంతం. హిందూత్వ విషయంలో బీజేపీ ఎంత పట్టుదలగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి హిందూమతంపై ఇటీవల కాలంలో ఏపీలో ఎన్ని దాడులు జరుగుతున్నాయో తెలిసిందే. మరి.. తన కోర్ సిద్ధాంతంతోనే విభేదించే పార్టీని బీజేపీ ఎన్డీయేలోకి తీసుకుని మంత్రి పదవులు ఇవ్వడం అసాధ్యమని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
జగన్ గత ఢిల్లీ పర్యటన వివరాలు బయటకు పొక్కనివ్వలేదు.. దాంతో అనేకానేక ఊహాగానాలు వచ్చి జగన్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఈసారి అలా జరక్కుండా ఈ కొత్త ప్రచారం తెచ్చారన్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఏపీలో ఇప్పటికే జనసేనతో బీజేపీకి ఉన్న సంబంధాలు దెబ్బతినేలా.. జనసేన బీజేపీని అనుమానించేలా వైసీపీ ఈ గేమ్ ఆడతున్నట్లు వినిపిస్తోంది. అందుకే కేంద్రం మంత్రి పదవులు ఇస్తామంటే వైసీపీ కాదంది అంటూ తాజాగా ప్రచారం మొదలైంది.
వైసీపీ ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకుంటున్నాబీజేపీ, ఆరెస్సెస్ వర్గాలు మాత్రం ‘‘భగవద్గీత, బైబిల్ ఒకే అరలో ఇమడవు’’ అని తెగేసి చెబుతున్నాయి.