ఏపీపై బీజేపీ ఆట ప్రారంభమైందా? తమిళనాడు తరహాలో ఇక్కడ కూడా పాలనను తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకునేందుకు బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? ఈ గేమ్‌లో వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి అయి.. ఆఖరుకు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదా? ఇదీ.. ఇప్పుడు సర్వత్రా జరుగుతున్న చర్చ. రెండు రోజుల కిందట బీజేపీ కీలక నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోటి నుంచి జాలువారిన ప్రసంగాన్ని పరిశీలిస్తే.. ఆయన దృష్టి మొత్తం ఏపీలోని అధికార పార్టీ వైసీపీపైనే ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. గత మంగళవారం ఢిల్లీలో అవినీతి నిరోధక విభాగం సదస్సు జరిగింది.
ఈ సదస్సులో ప్రధాని మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. సుమారు 40 నిముషాల పాటు సాగిన ప్రసంగంలో.. అవినీతిని పెంచి పోషిస్తున్న రాజకీయ నేతలను ఖచ్చితంగా జైలు గోడల మధ్యకు పంపాలనే గట్టి సందేశాన్ని ఇచ్చారు. అదేసమయంలో ఈ విషయంలో అధికార బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకునేది లేదంటూ.. సీబీఐ, ఈడీ తదితర సంస్థలకు అభయం ఇచ్చేశారు. అంతేకాదు.. వ్యవస్థకు ఇవి తీరని తలనొప్పులుగా పరిణమించాయని కూడా మోడీ ఉద్ఘాటించారు. సూట్‌కేసు కంపెనీలు పెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటుంటే.. చూస్తూ ఊరుకోవడం 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా కొనసాగాలా? అని తీక్షణంగా ప్రశ్నించారు.
మోడీ చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా.. సూటిగా.. సుత్తిలేకుండా ఏపీని ఉద్దేశించేనని రాజకీయ మేధావులు సైతం చెబుతున్నారు. వాస్తవానికి గతంలో బీజేపీకి చెందిన కీలక నేతలు ఆడ్వాణీ, మురళీ మనోహర్జోషి, ఉమాభారతి వంటివారిపై కేసులు ఉన్నాయి. అవి కూడా అయోధ్య వంటి కీలక మత ఘర్షణలకు సంబంధించిన కేసులు. వీటిలో వారికి క్లీన్ చిట్ వచ్చింది. దీంతో ఇప్పుడు అవినీతి భరతం పట్టేందుకు బీజేపీ నడుం బిగించింది. బీజేపీ లో నేతలు ఎవరూ కూడా అవినీతి కేసుల్లో లేకపోవడం గమనార్హం. బీజేపీ సానుకూల పార్టీల్లో ముఖ్యమైన శివసేన వంటి పార్టీల నేతలు కూడా అవినీతి కేసులు ఎదుర్కోవడం లేదు.
వారిపై ఉన్నా.. ఆ కేసులు కూడా మతపరమైన, భాషా పరమైన కేసులు తప్ప.. అవినీతి, ప్రజాధనం దోపిడీ వంటివి కానేకావని నివేదికలు, కేసులు కూడా చెబుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోప్రధాని వ్యాఖ్యలు.. ఎవరిని ఉద్దేశించినవి? అని పరిశీలిస్తే.. వైసీపీ నేతలను ఉద్దేశించే ప్రధాని మోడీ ఇలా వ్యాఖ్యానించి ఉంటారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో ఏవిధంగా అయితే.. అవినీతి కేసులను ఉన్నపళాన తేల్చేశారో.. అదే వ్యూహాన్ని ఏపీ విషయంలోనూ బీజేపీ అనుసరించనుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.
పైగా..బీజేపీ ఇప్పుడు వైసీపీకి చెందిన ఓ కీలక నాయకుడిని తమకు అనుకూలంగా మార్చుకుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్గా ఇటీవల కాలంలో మీడియాలో నిత్యం కనిపిస్తున్న నాయకుడిని రాబోయే రోజుల్లో ఏపీలో కీలక పాత్ర పోషించేలా బీజేపీ చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఇలా.. బీజేపీ ఏపీ విషయంలో తమిళనాడులో ఎలాంటి పాత్ర పోషించిందో.. ఇక్కడ కూడా అదే పాత్ర పోషించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలకు ముఖ్యంగా సీఎం జగన్‌కు జైలు బాట తప్పదనే ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.