సైడ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య.. 2023లో విడుదలైన `బేబి` చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. బేబీ తర్వాత ఆఫర్లు క్యూ కట్టినప్పటికీ కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న వైష్ణవి.. త్వరలోనే `జాక్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది. `బొమ్మరిల్లు` భాస్కర్, సిద్ధూ జొన్నలగడ్డ కాంబినేషన్లో తెరకెక్కిన జాక్ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవి చైతన్య.. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విశేషాలు కూడా పంచుకుంది. కెరీర్ గురించి మాట్లాడుతూ.. `తెలుగమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు రావనే ప్రచారం ఎలా వచ్చిందో తెలియదు.. కానీ ఇప్పటికీ చాలా మంది అమ్మాయిలు అదే నమ్ముతూ ఇండస్ట్రీలోకి రాలేకపోతున్నారు. అసలు ప్రయత్నిస్తేనే కదా.. అవకాశం వచ్చేది, రానిది తెలిసేది. కొంచెం ఓపికతో గట్టిగా ప్రయత్నిస్తే తప్పక అవకాశాలు వస్తాయి.. ఈ విషయంలో అదే జరిగింది` అంటూ వైష్ణవి చైతన్య చెప్పుకొచ్చింది.
ఫస్ట్ లవ్ గురించి చెబుతూ.. 18 ఏళ్ల వయసులో ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రేకప్ అయ్యింది. దాంతో మా బంధం ముందుకెళ్లలేకపోయింది. కానీ నా దృష్టిలో ఫస్ట్‌లవ్ ఎప్పటికీ ప్రత్యేకమే. తొలిప్రేమ అనుభూతులు ఎన్నేళ్లు గడిచినా మనసులో తీపి జ్ఞాపకాలుగానే ఉంటాయంటూ వైష్ణవి చైతన్య తెలిపింది.
ఇక తన ఫస్ట్ క్రష్ రామ్ పోతినేని అని వైష్ణవి తెలిపింది. అలాగే తన మొదటి రెమ్యునరేషన్ రూ. 3 వేలు అని, అనుష్క, సాయిపల్లవి తన ఫేవరెట్ హీరోయిన్స్ అని చెప్పుకొచ్చింది. చిరంజీవిగారు సహజనటి జయసుధ గారితో తనను పోల్చడం జీవితంలో మర్చిపోలేని ప్రశంస అని ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య తెలిపింది.