ఇటీవల కాలంలో ప్రచారంలోకి వచ్చిన వాడపల్లి లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు అనూహ్యం గా పోటెత్తుతున్నారు. ఈ ఆలయం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారు లు.. ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని భారీ ఎత్తున అభివృద్ధి చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో వస్తున్నారు. వాస్తవానికి మొదట్లో రోజుకు 100 మందిలోపు మాత్రమే భక్తులు వచ్చేవారు.
కానీ, ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడం, పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించడంతో భక్తుల రాక పెరిగింది. అయితే.. ఈ ఆలయానికి ఓ భక్తుడు.. ప్రతి శనివారం.. విమానంలో వస్తుండడం.. స్వామివారిని దర్శించుకోవడం.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త గత ఆరు శనివారాలుగా వాడపల్లి శ్రీవారి ఆలయానికి వస్తున్నారట.
పైగా ఆయన సొంత విమానంలో వస్తుండడం.. మరింత విశేషంగా మారింది. రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయానికి సొంత విమానంలో వచ్చి.. అక్కడ నుంచి కారులో ఆయన ఆలయానికి చేరుకుని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారట. ఇప్పటికి ఆరు వారాల పాటు ఆయన స్వామి వారి దర్శనం చేసుకున్నా రు. ఈ క్రమంలో ఆలయానికి కూడా ఆయన రూ.కోటి విరాళం అందించారట. మరో శనివారం కూడా వస్తారని ఆయల వర్గాలు వెల్లడించాయి.
ఎందుకంటే..
వాడపల్లిలోని శ్రీవారి ఆలయానికి ఇంత ప్రత్యేకంగా సొంత విమానంలో వారం వారం రావడం వెనుక ప్రత్యేక కారణం.. ఉందని అంటున్నారు. ఇక్కడి ఆలయ మహిమే దీనికి కారణమని అంటున్నారు. క్రమం
తప్పకుండా ఏడు వారాల పాటు స్వామిని దర్శించుకుని పూజలు చేస్తే.. కోరిన కోర్కెలు ఈడేరుతాయనే విశ్వాసం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సదరు వ్యాపారి ఇప్పటికి ఆరు వారాలుగా వస్తున్నారని చెబుతున్నారు. మరి ఆయన కోరిక ఏమో తెలియదు కానీ.. ఇప్పటికి ఆరు వారాలుగా ఆయన దర్శనం చేసుకున్నారు.
ఎక్కడుంది?
వాడపల్లి శ్రీవారి ఆలయం ఉమ్మడి తూర్పుగోదావరి(ప్రస్తుతం డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో) జిల్లాలో ఉంది. వాడపల్లి గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఎప్పుడో కొన్ని శతాబ్దాల కిందటే ఈ ఆలయాన్ని నిర్మించారని క్షేత్ర శాసనాలను బట్టి తెలుస్తోంది.
శిలా విగ్రహం కాదు:
వాడపల్లిలోని శ్రీవారి ఆయలంలో ఇతర దేవాలయాల్లో ఉన్నట్టుగా శ్రీవారి మూర్తి శిలా విగ్రహ రూపంలో ఉండదు. ఎర్ర చందన కొయ్యలో వెలసిన ‘స్వయంభూ’ క్షేత్రం ‘వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి’ వారి దేవస్థానం, ఇక్కడి స్వామి వారిని ‘కళ్యాణ వేంకటేశ్వరుడు’ అని కూడా పిలుస్తారు. స్వామి వారి ‘బ్రహ్మోత్సవం’ పది రోజులపాటు అంగరంగవైభవంగా నిర్వహిస్తారు.