తొందరలోనే కోవిడ్ టీకాల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కోవిడ్ టీకాలు కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ రెండు కూడా ఎమర్జెన్సీ డ్రగ్ పరిధిలోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది తొందరలోనే రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయట. ప్రస్తుతం పై రెండు టీకాలు కూడా కేవలం ప్రభుత్వం అనుమతించిన ఆసుపత్రుల్లో మాత్రమే దొరుకుతున్నాయి. రెగ్యులర్ మార్కెట్లోకి అడుగుపెట్టడమంటే ప్రతి మెడికల్ షాపుల్లోను, ప్రతి ఆసుపత్రిలో కూడా దొరుకుతాయి.
రెగ్యులర్ మార్కెట్లోకి విడుదలవ్వగానే టీకాల ధరలు కూడా బాగా తగ్గుతాయని సమాచారం. రెండు టీకాల డోసు ఒకటికి రు. 275 రూపాయలుగా ఫిక్సవ్వచ్చు. వీటికి సర్వీసు చార్జి 150 రూపాయలు అదనం. అంటే ఒక్కోటీకా సుమారు రు. 425గా ఉండచ్చు. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ధరల విషయమై కంపెనీల యాజమాన్యాలతో చర్చలు జరుపుతోంది. పై రెండు టీకాలను రెగ్యులర్ మార్కెట్లోకి విడుదలవ్వటానికి అనుమతివ్వాలంటు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సిఫారసు చేసింది.
ప్రస్తుతం ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ టీకా ధర డోసుకు రు. 1200 వసూలు చేస్తున్నారు. అలాగే కోవిషీల్డ్ డోసుకు రు. 780 తీసుకుంటున్నారు. మళ్ళీ వీటికి 150 రూపాయల సర్వీసు చార్జి అదనం. మార్కెట్ ఆథరైజేషన్ లేబుల్ గనుక దొరికితే అత్యవసర పరిస్థితులు, రిజర్వుడు కండీషన్స్ లో మాత్రమే వాడాలనే నిబంధనను ఎత్తేస్తారు. కాబట్టి రెగ్యులర్ మార్కెట్లోకి టీకాలు వచ్చేస్తాయి.
ప్రస్తుతం దేశం మొత్తం మీద సుమారు 145 కోట్ల మందికి టీకాలు వేశారు. ఇంకా అందరికీ రెండు డోసులు వేయలేదు. అయితే 18 సంవత్సరాలు దాటిన యువతకు కూడా టీకాలు వేయాలనేటప్పటికి పెద్దవారికి రెండు డోసులు వేయటంలో ఆలస్యమవుతోంది. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో టీకాల కార్యక్రమం బాగానే జరుగుతోందనే అనుకోవాలి. విశాలమైన దేశంలో కొండలమీద, అడవుల్లో ఉండే జనాభాను పట్టుకుని టీకాలు వేయటమంటే మామూలు విషయం అయితే కాదు.