జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి అన్నవరం నుంచి ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని ర్యాలి గ్రామంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పేరు మీద పూజలు నిర్వహించి, స్వామి వారికి 101 టెంకాయలు సమర్పించారు.
అర్చకులు శేషవస్త్రంతో, దీక్షకంకణంతో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామి వారి ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించి, యాత్రకి సంబంధించిన పోస్టర్ ని ఆవిష్కరించారు. మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ యాత్ర మొదలు అవుతుంది అనగానే వైసిపి నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నా యని అన్నారు. రాత్రికి రాత్రి ఆంక్షలు మొదలుపెట్టారని చెప్పారు.
సెక్షన్ 30 అని ఎన్ని ఆంక్షలు పెట్టినా యాత్రని అడ్డుకోలేరని బండారు వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా యాత్ర ప్రజల్లోకి తీసుకువెళ్ళతామని మీడియాతో తెలిపారు. జనసేన అధినేత యాత్ర నిర్వహించే వారాహి వాహనం సిద్ధమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.