టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటన ఖరారు అయింది. ఇవాళ్టి నుంచి రెండ్రోజుల పాటు జరగనుంది. తొలుత విశాఖ జిల్లా, చోడవరం చేరుకుని అటుపై విజయనగరం వరకూ ఆయన పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా కన్ఫం అయింది. ప్రతిపక్షనేత హోదాలో చాలా రోజుల తరువాత చోడవరం ప్రాంతానికి వస్తున్నారు. ఇక్కడ ఈయన మినీమహానాడు నిర్వహిస్తారు. రాత్రి బస అనంతరం గురువారం అనకాపల్లికి చేరుకుంటారు.
ఇక్కడి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకూ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమీక్షించాక, అటుపై విశాఖ ఎన్ ఏడీ కొత్త రోడ్డు మీదుగా విజయనగరం జిల్లా, భోగాపురం చేరుకుని శుక్రవారం ఉదయం రోడ్ షో నిర్వహించనున్నా రు. బాబు పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర నేతలంతా ఆ రెండు నియోజక వర్గాల్లో మోహరించారు. చోడవరం, అనకాపల్లిపై పూర్తి దృష్టి సారించనున్నారు.
ఇక్కడి అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ (వైసీపీ) కానీ, చోడవరం కరణం ధర్మశ్రీ (వైసీపీ) బలమైన నేతలుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో అవే అభ్యర్థిత్వాలు వైసీపీ తరఫున కన్ఫం అయితే విపక్షాలను ఎదుర్కొనేందుకు ఏం చేయాలో కూడా చెప్పనున్నారు. సంబంధిత దిశా నిర్దేశం చేయనున్నారు. ఖరీఫ్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఇక్కడి చోడవరం సుజల స్రవంతి పథకం ఆగిపోయిన వైనంపై ఆరా తీయనున్నారు.
ప్రాజెక్టుకు ఆవేళ తాను శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం తదితర ప్రాంతాలలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నేతృత్వం పార్టీ నడుస్తోంది. వీరికి బాబు దిశానిర్దేశం చేయనున్నారు. అటుపై విజయనగరం రోడ్ షో లో ప్రభుత్వ వైఫల్యాలు వివరిస్తూ, పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నెల్లిమర్ల నుంచి చీపురుపల్లి వరకూ రోడ్ షో ఉంటుందని విజయనగరం తెలుగుదేశం కార్యకర్తలు చెబుతున్నారు.
బాబు రాక దృష్ట్యా ముఖ్యనేతలంతా ఆయన్ను కలవనున్నారు. వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అటుపై మహానాడు స్ఫూర్తితో మరింత బాగా పనిచేసే విధంగా వీరిని కార్యోన్ముఖులను చేసేందుకు చంద్రబాబు సమాయత్తం అవుతారు.