ప్రపంచంలోని అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన దేశం అమెరికా. ఇక, అమెరికా అధ్యక్షుడు, విదేశాంగ మంత్రులు వంటి వీఐపీలకు చెందిన వస్తువులకు మరింత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తుంటారు. అయితే, ఇంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకొని, నిఘా నేత్రాల వంటి సీసీటీవీ ఫుటేజిల కళ్లుగప్పి ఓ అత్యంత విలువైన వస్తువు మాయమైంది. అమెరికా మాజీ విదేశాంగ శాఖా మంత్రి మక్ పాంపియోకు చెందిన ఆ వస్తువు కోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
ఆ వస్తువును ఎలా మాయమైందో కనిపెట్టేందుకు దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే, ఇంత సీరియస్ గా వెతుకుతున్నారంటే ఆ పోగొట్టుకున్న వస్తువు…నేషనల్ ట్రెజర్ సినిమాలో లైబ్రరీలో నుంచి హీరో దొంగిలించే ఇండిపెండెన్స్ డే డిక్లరేషన్ అనుకుంటే మీరు పొరబడినట్టే. ప్రస్తుతం బైడెన్ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది ఓ మద్యం బాటిల్ కోసం. దాదాపు రూ.4లక్షల విలువైన ఆ మద్యం బాటిల్ కోసం అమెరికా అధికారులు జల్లెడపడుతున్నారు. ఎందుకంటే, ఆ మద్యం బాటిల్ ను అమెరికాకు జపాన్ గిఫ్ట్‌గా ఇచ్చిందట.
ట్రంప్ హయాంలో అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో జపాన్ పర్యటనకు వెళ్లారట. దీంతో, పాంపియోకి జపాన్ అధికారులు ఓ ఖరీదైన వైన్ బాటిల్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే, 390 డాలర్ల కంటే తక్కువ విలువైన బహుమతుల వినియోగానికి మాత్రమే అమెరికా ప్రభుత్వం అనుమతిస్తుందట. ఆ పరిమితి దాటితే దాన్ని సదరు వ్యక్తి అదనంగా డబ్బు కట్టి వాడుకోవాలి. అయితే, ఆ మద్యం బాటిల్‌కు అలా అదనపు సొమ్ము చెల్లించినట్లు రికార్డులు లేవు. అసలా మద్యం బాటిల్ కూడా కనిపించడం లేదు. దీంతో, ఆ మద్యం బాటిల్ ఏమైందో తెలుసుకోవాలని బైడెన్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.