భారత్లో కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో పలు దేశాలు భారత్ పై ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. భారత్ లో ఉన్న తమ పౌరులపై ఇప్పటికే ఆస్ట్రేలియా తాత్కాలిక నిషేధం విధించింది. తాజాగా ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా చేరింది. భారత్ నుంచి విమానాల రాకపోకలపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. మే 4 నుంచి ఈ ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
గత 14 రోజులుగా ఇండియాలో ఉంటున్న యూఎస్ పౌరులు కాకుండా ఇతరులు తమ దేశంలోకి ప్రవేశించడానికి వీల్లేదని అధ్యక్ష భవనం తన ప్రకటనలో పేర్కొంది. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అయితే, ఈ నిషేధం నుంచి అమెరికా పౌరులతో పాటు గ్రీన్ కార్డు హోల్డర్లు, వారి భార్యలు, 21లోపు పిల్లలకు మినహాయింపు ఇచ్చింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
అయితే, ఈ ట్రావెల్ బ్యాన్ నుంచి కొందరికి మినహాయింపులు ఇస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. కొన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు, విలేకరులకు ప్రయాణ నిషేధం నుంచి మినహాయింపులు ఇచ్చామని తెలిపింది. వేసవి (ఫాల్) కాలంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ముఖ్యమైన విభాగాల్లో మౌలిక వసతులను అందించే ఇతర వ్యక్తులకు అమెరికా వచ్చేందుకు అనుమతించామని వెల్లడించింది. అయితే, కరోనా విజృంభణ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వీసాలను ఇస్తామని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపింది.