అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద నిర్ణయాలతో పలు దేశాల వారికి కంటగింపుగా మారిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవాలని కోరుకున్న వారిలో అత్యధికంగా భారతీయులు, చైనీయులే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్ని దేశాల వారినీ అక్కున చేర్చుకొని ఆదరించే అమెరికన్లలో లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టిన ట్రంప్….విదేశాల నుంచి ఉద్యోగం కోసం వచ్చేవారిని విపరీతంగా ద్వేషించారు.
ఈ క్రమంలోనే హెచ్1-బీ వీసాల విషయంలో ట్రంప్ పలు వివాదాస్పద ఆదేశాలివ్వడం, నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. అయితే, అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాను అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ఆదేశాలను రద్దుచేశారు. బైడెన్ నిర్ణయంతో హెచ్-1బీ వీసా వ్యవహారంలో పలువురికి ఊరట లభించింది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలో డిపెండెంట్ వీసాదారులకు బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు.
అమెరికాలో డిపెండెంట్ వీసాలతో ఉంటున్న మహిళలకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్లు ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైడెన్ తాజా నిర్ణయంతో డిపెండెంట్ వీసాలున్న మహిళలు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన పనిలేదు. బైడెన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో వేల సంఖ్యలో భారతీయ ఉద్యోగులు, వారి కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. హెచ్1బీ వీసాదారుల భార్యలకు, వారి పిల్లల్లో 21 ఏళ్లలోపు వయసున్న వారికి యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) హెచ్4 వీసాను జారీచేస్తుంది.
వాస్తవానికి, ఈ హెచ్4 వీసా కలిగినవారు వర్క్ పర్మిట్లు వచ్చే వరకు ఉద్యోగాలు చేయకూడదని గతంలో యూఎస్ సీఐఎస్ నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగంతో కలిసి న్యాయస్థానంలో పోరాడుతోంది. ఈ క్రమంలోనే తాగా ఈ వ్యవహారంలో సయోధ్య కుదరడంతో హెచ్4 వీసాలున్న కొన్ని కేటగిరీల మహిళలకు ఆటోమేటిక్ వర్క్ పర్మిట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అయితే, హెచ్ 4 వీసాదారుల్లో అత్యధిక శాతం మంది భారతీయ మహిళలే ఉండడం విశేషం.