దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మనదేశంలోనే కాకుండా విదేశాల్లోని తెలుగువారు కూడా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక, అమెరికాలోని భారతీయులంతా చీకట్లను పారద్రోలి వెలుగులు నింపే ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే వాషింగ్టన్ డీసీలోనూ దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“చీకటిలో నుంచి సత్యం, జ్ఞానాన్ని వెతుక్కోవచ్చనే విషయాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకొంటున్న హిందువులు, సిక్కులు, జైన్లు, బౌద్ధులకు దీపావళి శుభాకాంక్షలు.”అని జో బైడెన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు తన భార్య జిల్ బిడెన్ తో కలిసి దీపపు ప్రమిదలు వెలుగులు చిమ్ముతున్న ఫొటోను షేర్ చేశారు. ఇక, ప్రపంచ దేశాలలోని భారతీయులందరికీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండగ జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు అంటూ హ్యారిస్ ట్వీట్ చేశారు.
కరోనా మహమ్మారి కోరలు చాచిన ఈ తరుణంలో పండగ జరుపుకుంటున్నామని అన్నారు. అత్యంత పవిత్రమైన విలువలను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ట్వీట్ చేశారు. ఇక, అమెరికాలోని నేషనల్ డెమొక్రటిక్ క్లబ్లో ప్రముఖులు దీపాలు వెలిగించి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఎన్ఆర్ఐలు, అమెరికన్లు దీపావళి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తొలిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై దీపావళి థీమ్‌ను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని హడ్సన్ నదీతీరంలో ఎన్ఆర్ఐలు నదీతీరంలో బాణసంచాలు కాల్చారు.
మరోవైపు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి మనందరికీ ప్రత్యేకంగా నిలుస్తోందని, కఠినమైన సమయాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నామని అన్నారు. గత దీపావళితో పోలిస్తే ఈ ఏడాది చాలా ముందుకు వచ్చామని ట్వీట్ చేశారు. కుటుంబం, స్నేహితులతో ఈ సంతోష సమయాన్ని గడపాలని బోరిస్ అన్నారు.వీరితో పాటు శ్రీలంక అధ్యక్షుడు గొటాబయ రాజపక్స, శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మరికొందరు దేశాధినేతలు, ప్రముఖులు.. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.