అగ్రరాజ్యం.. ప్రజారాజ్యం.. పెద్ద మనుషులు.. విలువలు.. వంకాయి అంటాం కానీ.. రాజకీయం ఎక్కడైనా రాజకీయమే. కొందరు నాటుగా ఉంటే.. మరికొందరు క్లాస్ గా దెబ్బేస్తారు. ఇప్పుడు అలాంటి దెబ్బకు బాధితుడిగా మారాడు ముదురు ట్రంప్. తన నోటితో ఎవరి మీదనైనా ఇట్టే పడేసే ట్రంప్ నకు.. జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిలేలా నిర్ణయం తీసుకున్నారు జోబైడెన్. చూసినంతనే పెద్ద మనిషిలా.. మర్యాదస్తుడిగా వ్యవహరించే జోబైడెన్ సైతం.. తాను పదవి నుంచి దిగిపోయే వేళలో.. కాస్తంత ఉదారంగా ఉండాల్సిన బైడెన్.. తన రాజకీయ ప్రత్యర్థి ట్ంప్ కు భారీ షాకిచ్చేశారు.
అనూహ్యంగా లభించిన అవకాశాన్ని పూర్తిగా వాడేయటం ద్వారా ట్రంప్ శోకాలు పెట్టేలా చేశారు. ఇంతకూ జరిగిందేమంటే.. అమెరికాకు అధ్యక్షుడిగా తదుపరి బాధ్యతలు చేపట్టాల్సిన ట్రంప్ ప్రమాణస్వీకారం జనవరి 20న జరగనుంది. అయితే.. ఈ మధ్యనే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణం నేపథ్యంలో నెల రోజుల పాటు జాతీయ జెండాను అవనతం చేయాలని జోబైడెన్ ఆదేశించారు. ఈ నిర్ణయం ట్రంప్ కు ఒళ్లు మండేలా చేసింది.
ఎందుకంటే..ఆయన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలోనూ.. ప్రమాణస్వీకారం చేసే సమయంలోనూ అమెరికా జాతీయ పతాకం అవనతం చేసి ఉంటుంది. ఈ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. ఈ నిర్ణయంపై అమెరికన్లు సంతోషంగా లేరన్నారు. తన బాధను ప్రపంచ బాధగా పేర్కొనటం మహా నేతలు.. ప్రముఖులు చేసేదే. బైడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో జాతీయ జెండా అవనతం చేసి ఉంటుంది.ఇది చాలా గొప్ప విషయంగా వారు భావిస్తున్నారు.
వారికి దేశం అంటే ప్రేమ లేదు. ఒక మాజీ అధ్యక్షుడి మరణం కారణంగా కాబోయే అధ్యక్షుడి ప్రారంభానికి జెండా అవనతమై ఉండటం బహుశా అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చు’’ అని పేర్కొన్నారు. ఇలా చూడాలని ఎవరూ కోరుకోరన్న ట్రంప్.. తన నిర్ణయాన్ని పున: పరిశీలించే ఆలోచన లేదని వైట్ హౌస్ ప్రతినిధి కరీన్ జిన్ పియర్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడి మరణం కారణంగా జెండా అవనతం చేయటం తప్పేం కాదు. కాకుంటే.. కొత్త దేశాధ్యక్షుడి బాధ్యతల స్వీకారాన్ని పరిగణలోకి తీసుకొని బైడెన్ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుంటుందంటున్నారు. ఏమైనా.. బైడెన్ పైకి కనిపించినంత పెద్దమనిషిగా వ్యవహరించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.