మంచి మిత్రుడిగా.. నమ్మకస్తుడైన దోస్తు ఇలాంటి పేర్లు ఎన్ని చెప్పినా.. అమెరికా అగ్రరాజ్య దురహంకారాన్ని మాత్రం వీడటం లేదు. భారత్ తో తమకున్న సంబంధాలు గురించి గొప్పలు చెప్పుకునే అగ్రరాజ్యం.. అదంతా తన అవసరాల కోసం మాత్రమే. తనకు నష్టం వాటిల్లుతుందన్న విషయంలో ఆ దేశం ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుందన్న దానికి నిదర్శనంగా.. తాజా పరిణామాల్ని పలువురు ఉదహరిస్తున్నారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే విషయంలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరిని ప్రదర్శించటం తెలిసిందే.
ఇప్పటికే పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని వారి దేశాలకు పంపేసిన ఆయన.. భారత్ కు చెందిన మొదటి బ్యాచ్ ను సైనిక విమానంలో పంజాబ్ కు పంపేయటం తెలిసిందే. అయితే.. అమెరికా నుంచి భారత్ కు వచ్చే వేళలో. అక్రమ వలసదారుల కాళ్లకు.. చేతులకు సంకెళ్లు వేసి బంధించారనే ప్రారం భారీగా సాగుతోంది. అయితే.. దీనికి సంబంధించి బయటకు వచ్చిన ఫోటో వైరల్ గా మారింది.
అయితే.. ఫ్యాక్ట్ చెక్ లో సదరు ఫోటో నకిలీదిగా తేలింది. అయితే.. విమానంలో భారత్ కు పంపిన క్రమంలో తమకు సంకెళ్లు వేసి ఉంచారన్న విషయాన్ని పంజాబ్ కు చెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
మోడీ సర్కారు తీరుపై విమర్శలు వ్యక్తమయ్యేలా చేస్తోంది. మన వారి పట్ల యూఎస్ ఎంబసీ ప్రదర్శించిన తీరును పలువురు తప్పు పడుతున్నారు. అమెరికా నుంచి భారత్ కు చేరుకునే వరకు ఏం జరిగింది? అన్న అంశంపై ఇండియాకు తిరిగి వచ్చిన వారిలో ఒకరు మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో మమ్మల్ని ఒక క్యాంప్ లో ఉంచారు. అక్కడి నుంచి మమ్మల్ని మరో క్యాంప్ నకు తరలిస్తారని భావించాం. కానీ.. అలా జరగలేదు. ఒక పోలీసు అధికారి వచ్చి మమ్మల్ని భారత్ కు తిరిగి పంపించేస్తున్నట్లు చెప్పారు.
విమానం ఎక్కిన తర్వాత చేతులకు సంకెళ్లు వేసి.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. అమ్రత్ సర్ లో దిగే వరకు మమ్మల్ని అలానే ఉంచారు’’ అంటూ జస్పాల్ సింగ్ చెప్పిన మాటలు అమెరికా తీరుపై అగ్రహం వ్యక్తమయ్యేలా చేస్తోంది.
ఈ సందర్భంగా 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగఢేను ఇలానే అవమానిస్తే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించటం.. అందుకు అమెరికా ప్రభుత్వం దిగి వచ్చి.. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేయటం తెలిసిందే. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను వారి దేశాలకు తరలించే విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి సౌకర్యాల్లేని యుద్ధ విమానాలను ఉపయోగించటం.. వారి చేతులకు.. కాళ్లకు బేడీలు.. గొలుసులతో కట్టేయటం లాంటి వాటితో పాటు.. వారి పట్ల అనాగరికంగా వ్యవహరిస్తునన వైనంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా అమెరికా నుంచి భారత్ కు పంపిన అక్రమ వలసదారుల విషయానికి వస్తే.. వారంతా జనవరి 24న మెక్సికో సరిహద్దు వద్ద అమెరికాలోకి అక్రమంగా చొరబడే వేళలో పట్టుబడినట్లుగా గుర్తించారు. ఒక ఏజెంట్ చేసిన మోసంతోనే తామీ పరిస్థితుల బారిన పడినట్లుగా జస్పాల్ సింగ్ కంటతడి పెట్టాడు. అమెరికా యుద్ధ విమానంలో భారత్ కు చేరుకున్న వారిలో మరో (హర్విందర్) యువకుడు మాట్లాడుతూ.. తనను ఏజెంట్ ఖతార్.. బ్రెజిల్.. పెరూ..కొలంబియా.. పనామా.. ఇలా అంతా తిప్పి చివరకు మెక్సికో చేర్చాడని.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లే క్రమంలో తాము ప్రయాణిస్తున్న బోటు ప్రమాదానికి గురైనట్లుచెప్పారు.
ఈ ప్రమాదంలో కొందరు చనిపోగా.. తనలాంటి కొందరు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లుచెప్పారు. ఆర్థిక సమస్యలతోనే తాము దొడ్డిదారిన అమెరికాకు వెళ్లినట్లుగా పట్టుబడిన వారంతా చెబుతున్నారు. అమెరికా నుంచి భారత్ కు చేరుకున్న అక్రమ వలసదారుల్లో 33 మంది హర్యానాకు చెందిన వారు 33 మంది గుజరాత్.. పంజాబ్ కు చెందిన వారు 30 మంది.. మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు ముగ్గురు చొప్పున ఉన్నారు. చండీగఢ్ కు చెందిన వారు ఇద్దరు.. 19 మంది మహిళలు.. 13 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో నాలుగు.. ఐదు.. ఏడేళ్ల వయసు ఉన్న అమ్మాయిలు ఉన్నారు.
పంజాబ్ లో దిగిన అక్రమ వలసదారులపై ఎలాంటి కేసులు ఉండవని.. వారి గుర్తింపులను ధ్రువీకరించిన తర్వాత వారి సొంతూళ్లకు పంపిస్తామని ఆ రాష్ట మంత్ి కుల్దీప్ భరోసా ఇస్తున్నారు. అక్రమ వలసల్ని భారత్ కు పంపే వేళలో అగ్రరాజ్య వ్యవహారశైలిని తీవ్రంగా తప్పు పట్టాల్సి ఉందంటున్నారు. ఇప్పటివరకు ఈ అంశంపై మోడీ సర్కారు ఇప్పటివరకు స్పందించకపోవటం గమనార్హం.