వైసీపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఆత్మగా వ్యవహరించిన వేణుంబాకం విజయసాయిరెడ్డి వైసీపీని, తనకు ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వీడిన విషయం తెలిసిందే. దీనివెనుక వ్యూహం ఉందా? లేక, నిజంగానే ఆయన వ్యవసాయంపై మక్కువతోనే ఇలా చేశారా? అన్నది రోజులు గడిస్తేనే గానీ చెప్పలేం. కానీ, ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ఎవరూ సాయిరెడ్డిపై కామెంట్లు చేయలేదు. అధిష్టానం ఆదేశాలతో ఎవరికి వారు.. `అది ఆయన వ్యక్తిగత విషయం` అని వ్యాఖ్యానించారు.
తాజాగా జగన్ ఈ విషయంపై స్పందించారు. ఒక్కసాయిరెడ్డి మాత్రమే కాకుండా.. పార్టీ నుంచివెళ్లిపోయిన రాజ్యసభ సభ్యులు.. మోపిదేవి వెంకటరమన, ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావులపై విమర్శల వర్షం కురిపించారు. తాజాగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన సమీక్షించారు. ప్రస్తుత రాజకీయాలు.. అధికార కూటమి దూకుడు పై జగన్ తనదైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులు ఎంతో మంది ఉన్నారని అన్నారు.
అయితే.. రాజకీయాలు భ్రష్టు పట్టిపోతున్న ప్రస్తుత సమయంలో విశ్వసనీయత, నిజాయితీ ఉన్న నాయ కుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని.. అలాంటి వారు వైసీపీలో ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కానీ, కొందరు ఈ విశ్వసనీయత, నిజాయితీకి వెన్నుపోటు పోడుస్తూ.. రాజకీయాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు ఏశారు. ప్రలోభాలకు, బంధు ప్రీతికి, పదవులకు ఆశపడుతున్నారని చెప్పారు. అయితే.. ఎక్కడా వెళ్లిపోయిన నాయకుల పేర్లు జగన్ చెప్పలేదు.
కానీ, ఆయన మాట సారాంశం మాత్రం వారి గురించే కావడం గమనార్హం. “మన విలువ మనమే తగ్గించు కుంటున్నాం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. విశ్వసనీయ రాజకీయాలు కోరుకుంటున్నారు. నిజాయితీతో కూడిన నాయకులు కావాలని అనుకుంటున్నారు. కానీ, కొందరు ప్రలోభాలు, కేసులు… బంధు ప్రీతికి లొంగిపోతున్నారు. పార్టీలు మారుతున్నారు. ఇది వారికే వదిలేద్దాం. పార్టీని పునరుజ్జీవం చేసేందుకు ఏం చేయాలో మనం అదే చేద్దాం. పార్టీని ముందుకు నడిపిద్దాం“ అని జగన్ వ్యాఖ్యానించారు.