ఏపీలోని జగన్ పరిపాలనను నిశితంగా పరిశీలిస్తే.. రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. దళిత సామాజిక వర్గాల కు.. తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని.. కీలకమైన పదవులు.. హోదాలు వారికి ఇస్తున్నామని స్వయంగా సీఎం జగనే చెబుతున్నారు.
అంతేకాదు.. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా.. దళిత సామాజిక వర్గానికి మేళ్లు చేస్తున్నామని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే.. జగన్ చెబుతున్నట్టు దళితుల విషయంలో వైసీపీ సర్కారు పరిస్థితి ఫీల్ గుడ్గానే ఉందా? దళితులకు ఎనలేని రక్షణ ఉందా? అంటే.. కాదనే అంటున్నాయి.. అంతర్జాతీయ సంస్థలు.
అగ్రరాజ్యం అమెరికాకు చెందిన `ఎన్ జీవో` ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఏపీకి సంబంధించిన పలు అంశాలు కీలకంగా మారాయి. ఈ మానవహక్కుల నివేదిక లో ప్రత్యేకంగా భారతదేశంలోని పరిస్థితులపై దృష్టి సారించింది.
అందులోనూ ఏపీలో దళితుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న వివక్ష, లాకప్ డెత్, విశాఖ ఎల్జీ లో లీకేజీ, పోర్టులో జరిగిన ప్రమాదాలతోపాటు అనేకానేక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించింది. మానవహక్కులు, మైనారిటీ కోటా కింద రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎదుర్కొన్న అనేకానేక సంఘటనలను విశదీకరించింది.
నివేదికలో ఏముందంటే ‘‘ఎన్జీవో నివేదిక ప్రకారం…గత ఏడాది జూలై 20న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల వరప్రసాద్‌ను ఓ గొడవలో పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతన్ని బాగా కొట్టి గుండుగీయించారన్న ఆరోపణలు వచ్చాయి.
గత ఏడాది జూలై 21న 18 ఏళ్ల ఎరిచెర్ల కిరణ్ అనే దళిత యువకుడు ప్రకాశం జిల్లాలో పొలీసు కస్టడీలో ఉండగా మరణించారు. ఈ సంఘటనకు మూడు రోజుల ముందే అతను మద్యం సేవించి వాహనం నడపడంతోపాటు కరోనా నిబంధనలను పాటించలేదని, మాస్క్ ధరించలేదన్న అభియోగాలపై స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతనిని కొట్టడం వల్లే.. మరణించాడని పరోక్షంగా ప్రభుత్వం అంగీకరించి.. ఎస్సైపై కేసు నమోదు చేసింది.
దళితులు ఇప్పటికీ ఏపీలో తమ కులం కారణంగా కొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. పాఠశాలల్లో ఉదయం జరిగే ప్రేయర్లో పాల్గొననివ్వడం లేదు. తరగతి గదుల్లో వెనక బెంచీల్లో కూర్చోమం టున్నారు. లేదా బలవంతంగా వారితో టాయిలెట్లను కడిగిస్తున్నారు. కానీ, వాటిని వాడుకోనివ్వరు.
దళిత విద్యార్థుల హోమ్ వర్క్ నివేదికలను టీచర్లు చూడటం లేదన్న రిపోర్టులు కూడా ఉన్నాయి. కొన్నిచోట్ల వారికి మధ్యాహ్న భోజనం నిరాకరిస్తున్నారని, అగ్రవర్ణ పేద విద్యార్థులతో కాకుండా ప్రత్యేకంగా కూర్చోవా లని వారిని కోరుతున్నారు.
సో.. ఇదీ అగ్రరాజ్యానికి చెందిన ఎన్జీవోలు వెల్లడించిన నివేదికలు. మరి దీనిని బట్టి.. జగన్ పాలనలో దళితుల పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా పైపై మెరుగులు మానుకుని.. జగన్ దళితుల కోసం పాటు పడతారో లేదో చూడాలి.