అందరికీ ఆల్రెడీ తెలిసిన అమెరికా ఎన్నికల ఫలితాన్ని ప్రకటించే విధానంలో వ్యక్తమైన తీవ్రమైన నిరసన,ఉద్రిక్తత మరియు హింస కు ఎన్నికలు జరిగిన విధానం అందులో బ్యాలెట్లను హేండిల్ చేసిన విధానంపై అనేకమంది ప్రజల అనుమానాలు,అసంతృప్తి కారణంగా చెప్పవచ్చును.ఎన్నికలు జరిగిన విధానం మెచ్చదగిన విధము గాను,నమ్మదగిన విధము గాను లేదని అనేకమంది భావించడమే దీనంతటికీ కారణం.అయితే అమెరికాలో నివసించే తెలుగు ప్రజలకు ముఖ్యంగా ‘తానా’ ఎన్నికల గురించి అవగాహన ఉన్నవారికి ,ఇది ఏ మాత్రం ఆశ్చర్యంకలిగించలేదు సరికదా, ‘తానా’లో జరిగేదానితో పోలిస్తే ఇది ఏపాటి అని తేలిగ్గా తీసి పారేస్తున్నారు. ‘తానా’ ను నియంత్రించాలనుకునే నాయకుల ముఠా చేసే పనులు ఎంతోమందికి తెలిసిన విషయమే.
రాష్ట్రాలవారీగా కోటాలు ఇచ్చి, పోటీలు పెట్టి ఎవరికివారు స్వంత డబ్బుతో సంస్థపై ఏ ఇంట్రస్టు లేని వారిని కూడా సభ్యులుగా చేర్పించేలా చేయడం, ఆ సంఖ్యలనుబట్టి, వారికి రేటింగులు ఇచ్చి,దానిప్రకారం పదవులు పంచడం ద్వారా దేశవ్యాప్తంగా సంస్థను గుప్పిట్లో పెట్టుకోవడం తెలిసిందే. ఎవరైనా తమ సేవలను,నిబద్ధతను నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలని చూస్తే,వారిని ఏకాకులని చేసి, మిగతావారందిరినీ వారిపై ఉసికొలిపి,చేర్పించిన ఓటర్ల ఇళ్లకువెళ్లి ,సీల్డ్ బాలట్ కవర్లను ఒకేచోటుకు తెచ్చి, గంపగుత్తగా ముద్దర్లు గుద్ది, ఫలితాలను తారుమారు చేయటం వెన్నతో పెట్టిన విద్య.ఇక ఈ విధంగా గెలిచే వారికి ప్రజా సేవలపై కాక ,ముఠా సేవలే పరమార్ధం కాక పోదు లేదా ఇంకా పై పదవుల ఆశ హుళక్కే.అలాగే కొత్తగా సంస్థలోకి రావాలనుకునే వారు ముందుగా తమ స్వంత రాష్ట్రంలో పెద్ద మొత్తంలో ఓట్లు చేర్పించి,అప్లికేషన్ పెట్టుకోవలసిందే. దీనికి పరాకాష్టగా సరిగ్గా ఎన్నికల ముందు 2016 ఆగస్టు, సెప్టెంబర్ నెలలో రెట్టింపైన ‘తానా’ సభ్యత్వాలు బహిరంగ సత్యంగా చెప్పుకోవచ్చు.
‘నమస్తే ఆంధ్ర’ నవంబర్ లోనే ఊహించిన విధంగా సీనియర్ నాయకుడు ‘శ్రీనివాస గోగినేని’ ప్రెసిడింట్ ఎలెక్ట్ పదవికి పోటీలో ఉన్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అలాగే ‘నిరంజన్ శృంగవరపు ‘నమస్తే ఆంధ్ర’ తో మాట్లాడుతూ తాను కూడ అతి త్వరలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటిస్తానని చెప్పారు.అలాగే ‘నరేన్ కొడాలి’ వర్గం కూడా ప్రకటన తేదీ గూర్చి తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.ఈ సారి పోటీ తమ గుత్తాధిపత్యానికి ప్రమాదకరంగా మారుతున్న విషయం గమనించిన కొందరు పెద్దలు బే ఏరియా కు చెందిన మాజీ బోర్డు అధ్యక్షుని ద్వారా రాజీ ప్రయత్నాలు సాగించినట్లు,అవి విఫలంకాగా,ఎన్నికలే సరైన మార్గమని అయన చెపుతున్నట్లు తెలిసింది.కానీ ఎలెక్షన్లు జరిగితే ‘తానా’లో ఇప్పటివరకు జరిగిన అనేక విషయాలు మళ్ళీ బహిర్గతమై, అంతర్జాతీయ రచ్చ జరుగుతుందేమోనని చాలామంది భయపడుతున్నారు.