మాట చెప్పటం అంటే.. దాన్ని పూర్తి చేయటమే తప్పించి.. ఏదో చెప్పామంటే చెప్పామన్నట్లుగా చేయటం కాదన్న విషయాన్ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ తన చేతలతో చేసి చూపించారు. కోవిడ్ కు ఫైజర్ వ్యాక్సిన్ రావటం.. దాన్ని వేసుకునే విషయంలో అమెరికన్లు అంతగా నమ్మని నేపథ్యంలో.. తాను లైవ్ లో వ్యాక్సిన్ వేయించుకుంటానని 78 ఏళ్ల జో బైడెన్ వెల్లడించారు. దీనికి తగ్గట్లే అమెరికా కాలమానం ప్రకారం సోమవారం (మనకు మంగళవారం) ఆయన టీకా వేయించుకున్నారు. మొదటి డోస్ ను వేయించుకున్న ఆయన.. రెండో డోస్ వేయించుకోవటానికి తాను ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు.
ఆయన టీకా వేయించుకునే కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. వ్యాక్సిన్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అపోహల్ని తొలగించేందుకే టీకా వేసుకుంటున్నాను. టీకా వేసుకోవటానికి అందరూ సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. బైడెన్ వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందే ఆయన సతీమణి జిల్ బైడెన్ వేయించుకున్నారు. టీకా వేయించుకునే సమయంలో బైడెన్ పక్కనే జిల్ ఉన్నారు.
వ్యాక్సిన్ సమర్థతపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని.. అందుకే టీకా సురక్షితమనే విషయాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం తాను టీకా వేయించుకుంటానని బైడెన్ గతంలో చెప్పారు. దీనికి తగ్గట్లే తాజాగా ఆయన టీకా వేయించుకున్నారు. అమెరికా ఆహార.. ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో గత వారం నుంచి టీకా వేసే కార్యక్రమం అమెరికాలో మొదలైంది.
కరోనా కారణంగా ఇప్పటివరకు అమెరికాలో 3.20లక్షల మంది మరణించారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ఒక ఉదంతంలో ఇంత భారీగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోవటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. త్వరలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్న ట్రంప్ కూడా వ్యాక్సిన్ తీసుకుంటే.. దీనిపై మరింత విశ్వాసం పెరుగుతుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. గతంలో ట్రంప్.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్.. కోవిడ్ బారిన పడటం తెలిసిందే.