నరాలు తెగే ఉత్కంట.. అన్న మాటకు ఏ మాత్రం తీసిపోని రీతిలో..టీ 20 మ్యాచ్ ను తలపించేలా అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 50 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితల ఆధారంగా చూస్తే.. నువ్వా? నేనా? అన్నట్లుగా ట్రంప్.. బైడెన్ ల మధ్య పోరు నడుస్తోంది. మొత్తంగా చూస్తే.. ట్రంప్ కంటే బైడెన్ అధిక్యత స్వల్పంగా ఉంది. అలా అని ట్రంప్ కు అవకాశాలు మూసుకుపోలేదు. ఆశలు సజీనంగానే ఉన్నాయి. అదే సమయంలో చేతికి వచ్చినట్లే వచ్చి.. అవకాశం మిస్ అవుతుందా? అన్న సందేహం డెమొక్రాట్లలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల లెక్క తేల్చటంలో తాజాగా మిషిగన్ రాష్ట్ర ఫలితం కీలకం కానుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే..తానే గెలిచానంటూ ట్రంప్ ముందస్తుగా ప్రకటన చేయటమే కాదు.. సంబరాలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ లో మోసాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న ఆలోనలో ఉన్నారు. దీన్ని ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా బైడెన్ వర్గీయులు చెబుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన 44 రాష్ట్రాల్లో ఫలితం ఎలా ఉంది? మిగిలిన ఆరు రాష్ట్రాలు ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం? లాంటి విషయాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ముందు నుంచి అనుకున్నట్లే ఎన్నికల ఫలితాలు తేలేందుకు మరికొంత సమయం పడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కీలకమైన ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లే. ఇవి మొత్తం 538 ఉంటే.. అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలంటే బరిలో ఉన్న అభ్యర్థి 270 ఓట్లను సొంతం చేసుకోవాలి.
ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే.. డెమొక్రాట్ పార్టీకి 248 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయి. అంటే.. మేజిక్ ఫిగర్ కు 22 ఓట్లు అవసరం. ఫలితాలు వెలువడాల్సిన పెన్సిల్వేనియా.. మిషిగన్ రాష్ట్రాల్లో ఒకటి గెలవటం తప్పనిసరి.
రిపబ్లిక్ పార్టీ విషయానికి వస్తే.. 214 స్థానాల్లో ట్రంప్ అధిక్యంలో ఉన్నారు. ఆయన అధికారాన్ని తిరిగి చేపట్టాలంటే 56 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు అవసరముతాయి. ఫలితాలు వెల్లడి కావాల్సిన పెన్సిల్వేనియా.. నార్త్ కరోలినా.. జార్జియాల్లో నెగ్గటం అవసరం. ఇదిలా ఉంటే.. క ీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో లక్షల కొద్దీ ఓట్ల లెక్కింపు ఇంకా జరగాల్సి ఉంది. కాబట్టి అధిక్యం ఎవరి చేతుల్లోకి మారుతుందన్నది చెప్పటం అంత తేలికైన విషయం కాదు.
ఎన్నికలకు ముందు వెల్లడైన సర్వే ఫలితాలకు అనుగుణంగా ఫలితాలు వస్తున్నాయి. గడిచిన 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఈసారి 66.9 శాతం పోలింగ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెల్లడైంది. సర్వేల ప్రకారం బైడెన్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగాల్సి ఉంది. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్న విషయం వెల్లడైన ఫలితాల సరళిని చూస్తే.. ఇట్టే అర్థం కాక మానదు.దీంతో.. ముందుగా వేసిన అంచనాలకు భిన్నంగా ఫలితాల వెల్లడి సాగుతున్న నేపథ్యంలో తుది ఫలితం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠగా మారిందని చెప్పక తప్పదు.