ఏపీలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ దొంగ ఓట్ల నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ప్రతిపక్ష నేతలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ వ్యవహారంపై ఉరవకొండ ఎమ్మెల్యే, టీడీపీ నేత పయ్యావుల కేశవ్…కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు.
అనంతపురంలో 6 వేల దొంగ ఓట్లను చేర్పించి ఉన్న ఓట్లను తొలగించారని కేశవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా ఉరవకొండకు వచ్చి ఆ విషయాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు. ఈ క్రమంలోనే ఈ దొంగ ఓట్ల నమోదు ప్రక్రియలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని కమిషన్ సభ్యులు గుర్తించారు.
భాస్కర్ రెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పరిషత్ సీఈఓ గా ఉన్న భాస్కర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కొద్దిరోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆయనపై చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఆయనను తొలగించాల్సి వచ్చింది.