సెలబ్రిటీలు, క్రీడాకారులు, సినీతారలు..వీరిచ్చే ప్రతి స్టేట్ మెంట్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సోషల్ మీడియాలో వీరు పోస్ట్ చేసే చిన్న చిన్న విషయాలు, ఫొటోలపై కూడా నెటిజన్ల ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే, చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక, కొంతమంది యాక్టివ్ గా ఉన్నా…పోస్టుల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక, ఏదో ఏమరపాటులో కొందరు సెలబ్రిటీలు పెట్టిన పోస్టులు వివాదాస్పదమవుతూ ఉంటాయి. తాజాగా మెగా కోడలు కొణిదెల ఉపాసన చేసిన ఓ పోస్ట్ ఇపుడు ఈ కోవలోకే వచ్చి పెను దుమారం రేపుతోంది. ఉపాసన పోస్ట్ చేసిన ఓ ఫొటో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసనపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఉపాసన తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో అభ్యంతరకరంగా ఉందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన పోస్ట్ చేసిన ఓ గుడి గోపురం ఫొటో వైరల్ అయింది కొంతమంది ప్రజల విగ్రహాలు ఆ గోపురానికి ఉన్నట్లు ఆ ఫొటో ఉంది. ఇక, ఆ ఫొటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడని, తాము ఎక్కడ ఉన్నామో కనిపెట్టాలని ఆమె కోరారు. దీంతో, చాలామంది నెటిజన్లు ఆ ఫోటో పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
దేవుళ్ల విగ్రహాలు ఉండాల్సిన గోపురంపై మనుషులు ఉన్నట్లు ఫొటో రూపొందించడం ఏంటంటూ నెటిజన్లు ఉపాసనపై మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ఫొటో, వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. వెంటనే ఉపాసన ఆ ఫొటో తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై ఉపాసన, రామ్ చరణ్ స్పందన ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.