మాస్ కా బాప్, స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తొలిసారి ఓ టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన బాలయ్య దుమ్మురేపడంతో ఆ షో ఐఎండీబీ రేటింగ్స్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఈ షోలో ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన మూడు సీజన్లు ఆహా అనిపించాయి. రెండో సీజన్ లో తొలి ఎపిసోడ్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్ లు హాజరు కాగా..చివరి ఎపిసోడ్ కు పవన్ కల్యాణ్ హాజరై ఆ సీజన్ కు మంచి ముగింపునిచ్చారు.
మూడో సీజన్ లో పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే సీజన్ 4 ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. ఈ కార్యక్రమానికి హాజరైన బాలయ్య బాబు చిన్న కూతురు తేజస్విని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ షోకి క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉన్న తేజస్విని.. తన తండ్రి బాలకృష్ణలోని కొత్త కోణాన్ని అన్ స్టాపబుల్ టాక్ షో ఆవిష్కరించిందన్నారు.
“ఈ షోలో కొత్త పాయింట్ ఏంటంటే… డాడీలో ఎవరూ చూడని కోణాన్ని ఈ షో ద్వారా చూశారు. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడం, కష్టాల్లో ఉన్న తోటి వారి కోసం నిలబడడం, సామాజిక సేవకు ముందుండడం… ఇవన్నీ నాన్నగారిలో ఉన్న లక్షణాలు. సినిమాల్లో ఆయన చేయని జానర్ లేదు, ఆయన వేయని గెటప్ లేదు… ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి.
ఈసారి నాన్న గారు హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనతో నేను ఎక్కువ సమయం గడుపుతుంటాను కాబట్టి నాకు తెలుసు… ఎప్పుడూ హిందూపురం నియోజకవర్గం గురించే ఆలోచిస్తుంటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చే రోగులతో… ఇది ఆసుపత్రి కాదమ్మా, దేవాలయం అని నాన్న గారు చెబుతుంటారు. హేట్సాఫ్ డాడీ!” అని తన తండ్రి బాలకృష్ణను ఉద్దేశించి తేజస్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.