గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న సంగతి తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు,నైట్ కర్ఫ్యూపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 20 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణలో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల ప్రకారం కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను ఎత్తివేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి స్థాయి సన్నద్థతతో, జూలై 1 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది.
అయితే, ప్రజా జీవనం అస్తవ్యస్థం కాకూడదని, సామాన్యుల ఉపాధిపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కేబినెట్ తెలిపింది. ఈ నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు నిర్లక్షం వహించకూడదని, తప్పనిసరిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడంతోపాటు కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది.