కరోనా ఏమీ లేనట్లు అందరూ జాగ్రత్తలు లేకుండా తిరిగేస్తున్నారు. కానీ కరోనా తన మానాన తాను ఘోరాలు సృష్టిస్తూనే ఉంది. మొన్నటి వరకు ఇద్దరి ఎంపీలను బలితీసుకున్న కరోనా ఇప్పటికే అనేక మంది నేతలను, ఎమ్మెల్యేలను బలితీసుకుంది. తాజాగా ఏకంగా కేంద్ర మంత్రి సురేష్ అంగడి (కర్ణాటక) కరోనాతో తుదిశ్వాస విడిచారు. భారతదేశంలో కరోనా తీవ్రతకు ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు.
ఇటీవల చాలా యాక్టివ్ గా కనిపించిన కేంద్ర సహాయ మంత్రి అయిన సురేష్ అంగడి అనంతపురం నుంచి ఢిల్లీకి ఇటీవలే మొదలుపెట్టిన కిసాన్ రైలు ప్రారంభోత్సవంలో కూడా పాల్గొన్నారు. జస్ట్ వారం రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఆస్పత్రి పాలయ్యారు. సరైన చికిత్స అందించినా కరోనా నుంచి ఆయనను వైద్యులు కాపాడలేకపోయారు. చివరకు బుధవారం రాత్రి ఆయన కన్నుమూశారు.
సురేష్ అంగడి కర్ణాటకలోని బెలగావి జిల్లా బెల్గాం తాలుకాలోని కేకే కొప్పా గ్రామం. సోమవ్వ, చనబసప్ప దంపతులకు జన్మించిన సురేష్ అంగడి.. రాజకీయాల్లో అంచలంచలుగా ఎదగుతూ వచ్చారు. 2019 ఎన్నికల్లో బెలగావి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2004 నుంచి నాలుగు సార్లు వరుసగా ఎంపీగా గెలిచారు అంటే ఆయన ప్రజల్లో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో అర్థమవుతుంది.
సురేష్ అంగడి మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా కలత చెందారు. ఆయన ఇకపై మాతో లేకపోవచ్చు. ఆయన ఆలోచనలు మాత్రం మాతోనే ఉన్నాయి. సురేష్ అంగడి ఒక అత్యుత్తమ కార్యకర్త. ఎంపీగా, మంత్రిగా అంకితభావంతో అందించిన ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.