అవును! ఇప్పుడు జాతీయ మీడియా ఇదే మాట చెబుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్.. త్వరలోనే తన సీటును ఖాళీ చేయబోతున్నారని.. వేరే పోర్ట్ ఫోలియోలోకి వెళ్లబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో భిన్నమైన కథనాలు వస్తుండడం గమనార్హం. అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలను ఒక మహిళకు అప్పగించడం బీజేపీ చరిత్రలోఇదే ప్రథమం. అందునా దక్షిణాదికి చెందిన మహిళానేతకు ప్రధాని నరేంద్ర మోడీ ఈ అవకాశం ఇచ్చారు. దీనిపై అప్పట్లో మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ.. అనేక మంది మాట్లాడారు. వాస్తవమే కీలకమైన ఆర్థిక పగ్గాలను నిర్మల వంటి సానుకూల వ్యూహం, ధోరణి ఉన్న నాయకులకు దక్కడం అరుదే!
పైగా.. భారత్ వంటి అభివృద్ది చెందుతున్న దేశంలో ఆర్థిక పగ్గాలు అందిపుచ్చుకుని, లోటుపాట్లను సర్దుకుంటూ.. ముందుకు సాగడం, అన్ని వర్గాలను మెప్పించడం అంటే మాటలు కాదు. గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో రాజకీయ నేతలకు ఈ పగ్గాలు అప్పగించడం కన్నా ఆర్ధిక వేత్తకు అప్పగించడం బెటరని భావించిన మన్మోహన్సింగ్ను తెచ్చి ఆర్థిక మంత్రిని చేశారు. అలాంటి కీలకమైన స్థానంలో నిర్మల కూర్చుని ఏడాదిన్నర కూడా కాలేదు. ఇంతలోనే ఆమె మార్పుపై కథనాలు వస్తున్నాయి. దీనికి కొందరు చెబుతున్న ప్రధాన విషయంఏంటంటే.. ఆర్థిక మంత్రిగా నిర్మల విఫలమయ్యారని, అన్ని వర్గాలను సంతృప్తి పరచలేకపోయారని!
పైగా జీఎస్టీ బకాయిలు ఇవ్వకపోవడంతో రాష్ట్రాలు కేంద్రంపై గుర్రుగా ఉన్నాయని, కరోనా నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను లైన్లో పెట్టడంలో నిర్మల పూర్తిగా ఫెయిలయ్యారనేది వీరి వాదన. నిజమే! ఇవన్నీ నిజమే!! కాదనే వారు ఎవరూ లేరు. కానీ, ఆయా నిర్ణయాలు తీసుకోవడం వెనుక కేవలం నిర్మల మాత్రమే ఉన్నారా? ఆర్ధికరంగం కుదేలవడం, నిరుద్యోగం పెరిగిపోవడం, ధరలు ఆకాశాన్నంటడం వెనుక నిర్మలదేనా ప్రధాన పాత్ర!! ఇదీ .. తాజాగా మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనకు చెందిన అధికారిక పత్రిక సామ్నా లేవనెత్తిన ప్రశ్నలు.
ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోడీ కనుసన్నల్లోనే జరిగాయని, జీఎస్టీ బకాయిలు ఆపేందుకు వీలు కాదని నెల రోజుల కిందట జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రినిర్మలా సీతారామన్ స్పష్టం చేశారని..
అయినా.. ప్రధాని ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని, ఇప్పుడు రాష్ట్రాల నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మను బూచిగా చూపించి.. తప్పులతో నాకు సంబంధం లేదు.. మెప్పులు తప్ప అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సామ్నా కడిగి పారేయడం గమనార్హం. ఆమె తనంతట తానుగా ఈ పదవిని కోరలేదని, మోడీ కావాలనే ఈ పదవి ఇచ్చారని.. ఇప్పుడు తప్పులకు మాత్రం ఆమెను మాత్రమే బాధ్యురాలిని చేయడం సమంజసం కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఈ విషయంలోమోడీ ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఏదేమైనా.. ఆర్థిక మంత్రిగా ఎంపికై.. ఎంతటి రికార్డ్ సొంత చేసుకున్నారో.. అతి తక్కువ కాలంలో అంతే వివాదాస్పదమయ్యారనేది వాస్తవం!!