యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `తండేల్` నేడు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయింది. దాదాపు రూ. 70 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఓవర్సీస్ లో ఇప్పటికే షోలు పట్టడంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు.
శ్రీకాకుళంకి చెందిన కొందరు జాలర్లు సముద్రంలో దురదృష్టవశాత్తు పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశించి అక్కడి జైలులో ఏడాదికి పైగా మగ్గిపోయిన వృత్తాంతం ఆధారంగా రూపుదిద్దుకున్న తండేల్ మూవీకి ఊహించని టాక్ వస్తోంది. ఓ వర్గం ప్రేక్షకులు సినిమా బ్లాక్ బస్టర్ అని తమ అభిప్రాయాన్ని తెలుపుతుండగా.. మరికొందరు మాత్రం యావరేజ్ అని తేల్చేస్తున్నారు. కథ చాలా బలం ఉన్నప్పటికీ.. స్తో నెరేషన్, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా లేకపోవడం, పాకిస్థాన్ ఎపిసోడ్స్ సినిమాకు పెద్ద మైనస్ అంటున్నారు.
అయితే మెజారిటీ ఆడియెన్స్ నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. కెరీర్ లోనే నాగచైతన్య బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడని.. అతని యాక్టింగ్, యాస మరియు లుక్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటున్నారు. చైతన్య నటనకి నూటికి నూరు మార్కులు వేసేస్తున్నారు. అలాగే తండేల్ సినిమాకు మరో బలం దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్. రీసెంట్ ఇయర్స్ లో డీఎస్పీ బెస్ట్ మ్యూజిక్ ఇదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పటిలాగానే సాయి పల్లవి మరోసారి తెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిందని అంటున్నారు.
అయితే ఫస్టాఫ్ యావరేజ్ గా ఉందని.. సెకండాఫ్ మాత్రం అదిరిపోయిందని చెబుతున్నారు. ఒక మంచి లవ్ ట్రాక్, అద్భుతమైన పాటలు, కొంచెం పేట్రియాటిక్ టచ్ తో సినిమా ని ఎండ్ చేశారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత చైతూకి తండేల్ కంబ్యాక్ మూవీ అవుతుందని ఒక యూజర్ రివ్యూ ఇచ్చాడు. చైతూ యాక్టింగ్, దేవి శ్రీ మ్యూజిక్, సాంగ్, సెకండాఫ్, చైతూ-సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్ తండేల్ కు ప్రధాన బలంగా నిలిచాయని.. సినిమా బ్లాక్ బస్టర్ అని ఎక్కువ శాతం మంది చెబుతున్నమాట.