ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా తన ర్యాంకు `6` అని వెల్లడించారు. గురువారం జరిగిన మంత్రి వర్గ స మావేశంలో రెండుకీలక అంశాలపై ఆయన మంత్రులతో చర్చించారు. ఈ రెండు అంశాలను పరిగణన లోకి తీసుకున్నప్పుడు.. తాను ఆరో ర్యాంకులో ఉన్నట్టు తెలిపారు. సాధారణంగా.. సీఎం అన్నాక.. ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. కానీ, చంద్రబాబు ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. చంద్రబాబు పాలన అంటే.. ప్రతి దానికీ లెక్కలు వేసుకుంటారు.
ప్రభుత్వ పాలన నుంచి మంత్రుల పనితీరు వరకు, ప్రజల సంతృప్తి నుంచి అధికారుల పనితీరు వరకు చంద్రబాబు అన్ని అంచల్లోనూ మార్కులు వేసుకుని.. దాని ప్రకారం పనులు ముందుకు తీసుకువెళ్తారు. తద్వారా పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాలని.. మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా లెక్కలు వేసుకుంటారు. ఇలా, తరచుగా మార్పులు చేసుకుంటూ మార్కు లు వేసుకుంటూ ముందుకు సాగడంలో చంద్రబాబు సర్కారు ముందంజలో ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా మంత్రుల పనితీరు, వారు క్లియర్ చేస్తున్న ఫైళ్లు అనే రెండు అంశాలపై చంద్ర బాబు తన అంచనాను చెప్పుకొచ్చారు. ఈ రెండు విషయాల్లోనూ తాను ఆరోస్థానంలో ఉన్నానని తెలిపిన ట్టు సమాచారం. ఇక, మంత్రుల్లో ఫస్ట్ ప్లేస్‌లో మహ్మద్ ఫరూక్ ఉన్నారని.. వాసం శెట్టి సుభాష్ చివరి స్థానంలో ఉన్నట్టు వివరించారు. మైనారిటీ శాఖ మంత్రిగా ఫరూక్.. ఏ సమస్య వచ్చినా వెంటనే రియాక్ట్ అవుతున్నట్టు చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా ఫైళ్లను కూడా క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు.
తన విషయానికి వస్తే.. పర్యటనలు, ఫిర్యాదుల స్వీకరణ, వ్యూహాలు సిద్ధం చేయడం.. లోపాలు సరిదిద్ద డం, పెట్టుబడుల వేట వంటి అంశాలకే సమయం ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోందని.. దీంతో ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడినట్టు చంద్రబాబు ఒప్పుకొన్నారు. ఇప్పుడు చేస్తున్న పనితీరు బాగానే ఉన్నా.. మంత్రుల పనితీరు ఇంకా బాగా మెరుగు పడాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాగా, ఈ ర్యాంకుల్లో మంత్రి నారా లోకేష్ 8వ స్థానంలో ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10వ స్థానంలో ఉన్నారు.