ఏపీ సీఎం జగన్‌కు భారీ సెగతగిలింది. ఆయన నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గంటల నుంచి భారీ ఎత్తున యువత కదం తొక్కుతోంది. నిజానికి ఏ ప్రతిపక్ష నేతలో.. ప్రత్యర్థి పార్టీ నాయకులో రోడ్డెక్కితే.. రాజకీయంగా విమర్శలు చేసేందుకు అధికార పార్టీ వైసీపీకి అవకాశం ఉండేది. కానీ, గతంలో జగన్ వెంట నడిచిన యువత, జగన్ సీఎం కావాలని ఓట్లు వేసిన యువత..ఇప్పుడు రోడ్డెక్కారు. ఆ జిల్లా ఈ జిల్లా అని తేడా లేకుండా.. ఏపీ వ్యాప్తంగా అనూహ్యంగా .. యువతీయువకు లు ఎర్రటి ఎండను కూడా లెక్కచేయకుండా.. రోడ్లపైకి చేరుకుని జగన్‌కు వ్యతిరేకంగా.. ఉద్యమిస్తున్నారు.
రెండు రోజుల కిందట.. ఏపీ సీఎం జగన్.. చదువుకున్న యువతను దృష్టిలో పెట్టుకుని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనిలో కొన్ని పోస్టులను ప్రకటించారు. అయితే.. గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 36 మాత్రమే(ఈ ఏడాది మొత్తానికి) ప్రకటించడంపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్ల నుంచి గ్రూపు ఉద్యోగాలను ప్రకటించడం లేదని.. చంద్రబాబు హయాంలో 6 సార్లు గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టారని.. విద్యార్తులు అంటున్నారు. అదేసమయం లో కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్న డీఎస్సీ ఉద్యోగాలపై మాట మాత్రంగా కూడా జాబ్ క్యాలెండర్లో పేర్కొనక పోవడంపైనా.. ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను వ్యతిరేకిస్తూ విజయనగరంలో తొలుత ఈ రోజు ఉదయాన్నే విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నోటిఫికేషన్ ఉపయోగకరం కాదంటూ కోట కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. విద్యార్థి సంఘాలు కోట కూడలి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టి.. కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక, విజయనగరంలో విద్యార్థులు కదం తొక్కుతున్న విషయం తెలియగానే.. రాష్ట్ర వ్యాప్తంగా యువతీయువకులు రోడ్డెక్కారు. దీంతో సీఎం జగన్‌కు భారీ సెగ తగలడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు జగన్ తీసుకున్న నిర్ణయాల్లో అమరావతి తర్వాత.. ఆ రేంజ్లో ఒకరకంగా చెప్పాలంటే.. అంతకుమించి అన్న రీతిలో ఇప్పుడు యువత ఉద్యమించడం గమనార్హం.