తెలుగు ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేని రాజకీయ నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ నేతగా సుపరిచితుడైన ఆయన.. విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యాక మరే పార్టీలో చేరకుండా ఉండటం తెలిసిందే. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చే ఆయన.. సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో విమర్శలు చేయటం తెలిసిందే. గతంతో పోలిస్తే.. ఇటీవల కాలంలో మీడియా సమావేశాన్ని నిర్వహించే విషయంలో తక్కువ చేస్తున్న ఉండవల్లి.. తాజాగా విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన బీజేపీని టార్గెట్ చేశారు. తాను సుదీర్ఘకాలం పని చేసిన కాంగ్రెస్ ఐడియాలజీకి పూర్తి భిన్నంగా ఉండే బీజేపీ తీరును ఆయన తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. దేశంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తుంటే ఆందోళన కలుగుతోందన్న ఆయన.. రాజకీయాల్లో మతాన్ని తీసుకొచ్చి వివాదం చేయటాన్ని తప్పు పట్టారు. ఈ తీరును ఆయన విమర్శిస్తూ.. ‘అసలు మనం ఎటు వైపు పోతున్నామన్నది తెలియని పరిస్థితి నెలకొని ఉంది. చదువుకుంటున్న వాళ్లు కూడా సంకుచితంగా ఆలోచిస్తున్నారు. ప్రపంచ దేశాలు మన సంప్రదాయాల్ని గౌరవిస్తూ.. అమలు చేస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
ఇక.. బీజేపీలోకి ఇతరపార్టీల నేతలు చేరటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ .. ఇతర పార్టీల్లో ఉన్న వారు సైతం బీజేపీలోకి వెళ్లటం ఏమిటని ప్రశ్నించారు. కేంద్ర.. రాష్ట్ర మంత్రులుగా పని చేసిన వారు సైతం బీజేపీలోకి వెళ్లటం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. పదవుల కోసం బీజేపీ ఐడియాలజీ ఏమిటన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా పార్టీలో చేరటం ఏమిటన్న ఆవేదనను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ది సెక్యులరిజం అయితే.. కమ్యూనిస్టులది సోషలిజమని.. బీజేపీది హిందూయిజమన్న ఆయన.. అన్ని రంగాల్లో బీజేపీ ఫెయిల్యూర్ అయ్యిందన్నారు. అన్ని విషయాల్లో వైఫల్యం చెందిన మోడీ సర్కార్.. మతం విషయంలో మాత్రం విజయం సాధించిందన్నారు. ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు బీజేపీకే మద్దతు ఇవ్వటాన్ని తప్పు పట్టారు. రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ కానీ.. విపక్షం టీడీపీ కానీ.. మరో మిత్రపక్షం జనసేన కానీ.. వాళ్లల్లో వాళ్లు తిట్టుకుంటారే కానీ.. బీజేపీని మాత్రం ఒక్కరు పల్లెత్తు మాట అనరన్నారు. ‘ఈ మూడు పార్టీలు బీజేపీకే మద్దతు ఇస్తున్నాయి. బీజేపీని ఒక్క మాట అనరు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విషయంలో కాంగ్రెస్ ఎంత నష్టం చేసిందో.. అంతకు మించిన నష్టం కేంద్రంలోని మోడీ సర్కారు కారణంగా జరుగుతుందన్న భావన వ్యక్తమవుతున్న వేళ.. ఉండవల్లి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకునేలా ఉండటం గమనార్హం.