ఉక్రెయిన్‌లో మహిళలపై రష్యా సైనికులు దారుణంగా వ్యవహరిస్తున్నట్లు ఓ మహిళ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ అత్యాచారాలను ఆపాలంటూ నగ్నంగా నిరసన తెలిపింది. ఫ్రాన్స్‌లో అట్టహాసంగా జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఓ మహిళ చేపట్టిన నిరసన చర్చనీయాంశంగా మారింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య సినీ తారలతో కోలాహలంగా మారిన ఆ ప్రాంతంలో.. అకస్మాత్తుగా ఓ ఉక్రెయిన్ మహిళ తన పైదుస్తులను తీసేసి.. నిరసన వ్యక్తం చేసింది.
శరీరం ముందు భాగంపైన ఉక్రెయిన్ జాతీయ జెండా, వీపు మీద స్కమ్ అనే పదాన్ని పేయింట్ వేయించుకుంది ఆ మహిళ. అలాగే ఆమె శరీరం ముందు భాగంలో ‘స్టాప్ రేపింగ్ అజ్`(మాపై అత్యాచారాలు ఆపండి) అని రాసి ఉంది. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే మోకాళ్లపైన కూర్చొని.. ‘మా పైన అత్యాచారాలు ఆపండి’ అని బిగ్గరగా అరిచి నిరసన తెలిపింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆమెపై వస్త్రాన్ని కప్పారు. ఘటన జరిగిన సమయంలో ‘త్రీ థౌజెండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్’ సినిమాకు సంబంధించిన ఇడ్రిస్ ఎల్బా, టిల్డా స్వింటన్ వంటి ప్రముఖ తారలు కూడా ఉన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి.. రష్యన్లు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పలు వార్తలు కూడా ప్రచురితం అయ్యాయి.
ఈ నేపథ్యంలో రష్యా సైనికుల తీరును నిరసిస్తూ.. ఆ మహిళ నగ్నంగా ఆందోళన తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్ పరిస్థితులను వివరిస్తూ.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకల రోజు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రసంగించారు. మొత్తానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహారం అంతర్జాతీయ వేదికలపై తీవ్ర దుమారం సృష్టిస్తోంది.