ఉగాది.. సాధారణంగా తెలుగు సంవత్సరాది. ఆరోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే.. ఇప్పుడు ఈ ఉగాదే.. వైసీపీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోంది. ఆ రోజు నుంచి వారికి మరో.. రాజకీయ వ్యూహం ప్రారంభం కానుంది. దీంతో వారు టెన్షన్లో ఉన్నారు. ఒకవైపు కొత్త జిల్లాల అమలు.. ప్రక్రియ ఉగాది నుంచి ప్రారంభం కానుంది. అదేసమయంలో .. మంత్రి వర్గ విస్తరణ కూడా అదే రోజు ఉంటుందని.. నాయకుల మధ్య చర్చసాగుతోంది. ఈ క్రమంలో ఎవరికి మంత్రి పదవులు వస్తాయి.. ప్రస్తుతం ఉన్న కొత్త జిల్లాల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు? అనే విషయంపై చర్చ సాగుతోంది.
మంత్రి వర్గంపై తీరని చర్చ
వైసీపీలో కొత్త మంత్రి వర్గంపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. ఎవరికి వారు… తమకు పదవి దక్కుతుందనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా కీలకమైన ప్రకాశం జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నవారి సంఖ్య రెండు నుంచి నాలుగుకు పెరిగింది. కందుకూరు, గిద్దలూరు, సంతనూతలపాడు, దర్శి ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రి పదవి కోసం దర్శి, గిద్దలూరు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ బంధువు, మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు.
మంత్రి బాలినేనితో సఖ్యత లేని కందుకూరు ఎమ్మెల్యే నేరుగా వైఎస్ జగన్‌తో నెల్లూరుజిల్లా నేతల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనేది సీఎం స్వయంగా నిర్ణయిస్తారని అధిష్టానం పెద్దలు ఇప్పటికే తేల్చిచెప్పేశారు. ప్రస్తుతం వైసిపిలో మంత్రి పదవుల పందేరం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్‌లు మంత్రులుగా చక్రం తిప్పుతున్నారు.
రేపు మంత్రివర్గ పునర్వస్తీకరణలో వీరిద్దరు మంత్రి పదవులు కోల్పోతే ఈ రెండు నియోజకవర్గాలను తప్పించి మిగిలిన ఆరు నియోజకవర్గాలనుంచి నలుగురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. దర్శి నుంచి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, గిద్దలూరు నుంచి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు, కందుకూరు నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. వీరిలో గిద్దలూరు ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఫైర్ బ్రాండ్ కావడం… టీడీపీ నుంచి రావడమే దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇక, కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డికి మంత్రి బాలినేనితో కొంత విబేధాలు ఉన్న మాట వాస్తవమే. ఈ కారణం చేత ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదంటున్నారు. దర్శి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు పార్టీలోనే వర్గపోరు తీవ్రంగా ఉంది. దీంతో వారికి మంత్రి పదవులు ఇస్తే ప్రత్యర్థులు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. ఇక, మిగిలిన సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు దళిత కోటాలో మంత్రి పదవి ఇవ్వాలంటే ఇటీవల ఆయనపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు అడ్డంకిగా మారాయంటున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి. . ఈయన ఫ్రెషర్ కావడంతో పాటు తండ్రి మార్కాపురం నుంచి గతంలో ఎమ్మెల్యేగా, సీనియర్ పొలిటిషియన్‌గా ఉన్నారు. దీంతో ఈయనకు మంత్రిగా అవకాశం దక్కే అవకాశాలు ఉన్నాయి.
ఇక, జిల్లాల సంగతి ఇదీ..
రాష్ట్రంలో ఉగాది నుంచే కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపధ్యంలో.. జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లు కసరత్తు ప్రారంభించారు. ఉగాది నుంచే కొత్తజిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాదికారులు కార్యకలాపాలు నిర్వహించనున్నారు. కొత్త జిల్లాలపై నోటిఫికేషన్ వచ్చిన రోజునుంచే ఓఎస్డీల హోదాలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు నిర్వహించనున్నారు. కొత్తజిల్లాలతో పాటు మంత్రివర్గ పునర్వస్తీకరణతో కొత్తమంత్రులు కూడా కొలువుతీరనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.