ఈ అనంత విశ్వంలో ఎన్నో జీవరాశులున్నాయి. ఎన్నో గ్రహాలు…మరెన్నో వింతలూ, విశేషాలు, జీవరాశులు ఉన్నాయి. అయితే, ఈ విశ్వంలో మానవుడితో పాటు గ్రహాంతరవాసులూ ఉన్నారని కొందరు….లేరని మరికొందు ఎన్నో ఏళ్లుగా వాదించుకుంటున్నారు. అమెరికాలోని ఏరియా 51లో కొన్ని ఏలియన్స్, గ్రహాంతరవాసులపై రహస్యంగా పరిశోధనలు చేస్తున్నారన్న పుకార్లు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
ఇక, ఈ అనంతకోటి విశ్వంలో మానవుడితోపాటు ఏలియన్లు కూడా ఉన్నాయని ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కూడా చెప్పారు. ఈ క్రమంలోనే అడపాదడపా యూఎఫ్ వో, ఫ్లయింగ్ సాసర్లు కనిపించాయని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యూఎఫ్ వోలపై రిసెర్చ్ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ జెరీమీ కార్బెల్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాకు చెందిన ఒక యుద్ధనౌకను కొన్ని యూఎఫ్‌వోలు చుట్టుముట్టాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు, ఇందుకు సంబంధించిన రాడార్ దృశ్యాలను కూడా ఆయన విడుదల చేయడం సంచలనం రేపింది. ఈ విజువల్స్ లో 9 వస్తువులు నౌకకు దగ్గరగా రావడం కనిపించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియెగో తీరానికి దగ్గరలో 2019 జులైలో జరిగిన ఈ ఘటన వీడియోను ఇప్పుడు విడుదల చేశామని కార్బెల్ తెలిపారు. ఈ ఫుటేజీ వాస్తవమైనదేనని అమెరికా రక్షణ శాఖ కూడా ధ్రువీకరించడం విశేషం.
యూఎఫ్ వోలు గంటకు 70 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు కార్బెల్ తెలిపారు. ఒమాహా యుద్ధనౌక వేగం కన్నా ఇది దాదాపు 3రెట్లు ఎక్కువని తెలిపారు. అయితే, కొద్ది సేపటి తర్వాత రాడార్ తెరపై నుంచి యూఎఫ్ వోలుగా భావిస్తోన్న వస్తువులు అదృశ్యమైనట్లు వివరించారు. రాడార్ పరిధికి అందకుండా ఆకాశంలో చాలా ఎత్తుకు గానీ సముద్రంలోకి గానీ అవి చేరి ఉండొచ్చని కార్బెల్ అంటున్నారు.
ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయడానికి ఒబామా హయాంలో అమెరికా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వచ్చే నెలలో తన నివేదికను విడుదల చేయనుంది. మరి, ఏలియన్ల ఉనికి నిజమేనా..యూఎఫ్ వోలున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.