ప్రమాదకర పరిస్థితులున్న వ్యక్తికి.. మరో మార్గం లేక పంది గుండెను ఒక వ్యక్తికి అమర్చటం.. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తాంశంగా మారిన వైనం తెలిసిందే. రెండు నెలల క్రితం విజయవంతంగా చేపట్టిన ఈ ఆపరేషన్ కు సంబంధించిన ఫలితం తాజాగా వెలువడింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ కావటం.. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ పేరు మారుమోగింది. మనిషి సాధించిన సాంకేతిక అద్భుతంగా పలువురు అభివర్ణించారు.
అయితే.. ఈ ప్రయోగం మీద కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా తాజాగా సదరు వ్యక్తి మరణించటంతో.. పంది గుండెను అమర్చిన ఆ వ్యక్తి తాజాగా కన్నుమూసిన వైనంపై వైద్యులు ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. మరణానికి కారణం ఏమిటి? అన్న అంశంపై వారు ఇప్పుడు ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. బెన్నెట్ మరణానికి కారణం ఏమిటన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఆయన మరణంపై మరింత పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.
వైద్య శాస్త్ర చరిత్రలో తొలిసారి ప్రాణాపాయం ఉన్న వ్యక్తికి ఉండే సహజ గుండె స్థానంలో పంది గుండె అమర్చటం.. దానిపై ప్రపంచవ్యాప్తంగా అదో అద్భుతమైన అంశంగా ప్రచారం సాగటం తెలిసిందే. అయితే.. సర్జరీ విజయవంతమైందని భావిస్తున్న రెండు నెలలకే అతగాడు ప్రాణాలు పోగొట్టుకోవటం షాకింగ్ గా మారింది. ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందన్న ప్రకటన చేసే వేళలోనే.. యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ మెడికల్ సెంటర్ నిపుణులు ఒక కీలక వ్యాఖ్య చేశారు. శస్త్ర చికిత్స విజయవంతమైనందని చెప్పుకోవటం కంటే.. అదెంత వరకు నిజమన్నది కాల ప్రయాణమే చెబుతుందన్నారు.
అలాంటిది ఆపరేషన్ జరిగిన రెండునెలలకే మరణించటంతో.. ఆయన మరణం వెనుక చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కోలుకున్నట్లే కోలుకొని అంతలోనే అనారోగ్యం పాలై.. మరణించటం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. పంది గుండె అమర్చిన ఆపరేషన్ ఫెయిల్ అయ్యిందా? అన్నది ప్రశ్నగా మారింది. ఆయన మరణంపై మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే.. అసలేం జరిగిందన్నది వెల్లడిస్తామని చెప్పారు. సక్సెస్ అయ్యామన్న ఆనందాన్ని పంచుకున్న కొద్ది రోజుల్లోనే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. ఇంతకీ పంది గుండెను మనిషికి అమర్చిన ఆపరేషన్ సక్సెస్సా? అయితే ఎంత? అన్నదిప్పుడు అసలు ప్రశ్నగా మారింది.