జగన్ పై, వైసీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరని పోలీసులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పట్టాభికి బెయిల్ రావడంతో ఆయన బయటకు వచ్చారు. అయితే, పట్టాభి అరెస్టు సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పట్టాభి అరెస్టు వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది.
పట్టాభిని అరెస్ట్ చేసేటపుడు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజులు నిబంధనలు పాటించలేదు, దీంతో, వారిపై తాజాగా పోలీసు ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. పట్టాభి అరెస్టు సమయంలో ఇచ్చిన నోటీసులలో ఖాళీలున్నాయని, దీనిపై మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేసినందునే వారిపై చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది. ఏసీపీ రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించగా, సీఐ నాగరాజును ఏలూరు రేంజి డీఐజీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కాగా, ఈ నెల 20న పట్టాభిని విజయవాడ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంటి తలుపులు పగలగొట్టి మరీ పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది. అనంతరం ఈ నెల 21న పట్టాభిని పోలీసులు…మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఖాళీలతో ఉన్న నోటీసు ఇవ్వడంపై మేజిస్ట్రేట్ అభ్యంతరం చెప్పారు. దీనిపై విచారణ అధికారి అయిన గవర్నర్‌పేట సీఐని వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారని తెలుస్తోంది.
హైకోర్టులో వాదనల్లోనూ ఈ విషయంపై పోలీసులను న్యాయమూర్తి తప్పుపట్టారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరినీ బదిలీ చేసినట్లు తెలిసింది. దీంతోపాటు, పట్టాభి నుంచి వివరణ తీసుకోకుండానే అరెస్టు చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఈ కారణాలను పరిగణనలోకి తీసుకుని బాధ్యతగా వ్యవహరించలేదన్న కారణంతో వారిని పోలీసు ఉన్నతాధికారులు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.