బాలీవుడ్ సినీ నటి కాదంబరి జెత్వానీకి సంబంధించిన కేసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న తాజా విచారణ కీలక మలుపు తిరిగినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో వివాదాస్పదంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవటం.. సస్పెండ్ చేయటం తెలిసిందే. విచారణలో భాగంగా నాటి సీఎంవో హస్తం కూడా ఉందని.. సీఎంవోలో అన్నీ తామై వ్యవహరించే ఇద్దరి మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటున్నారు. ఈ ఇద్దరు గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన వారే కావటం గమనార్హం.
వీరిలో ఒకరు గత ప్రభుత్వంలో అంతా తానై అన్నట్లుగా నడిపించిన సకల శాఖల మంత్రిగా పేరున్న సలహాదారు కాగా.. ఇంకొకరు సీఎంవోలో అన్నీ తానై నడిపించిన ఐఏఎస్ అధికారిగా చెబుతున్నారు. వీరి సమక్షంలోనే జనవరి 31న నాటి నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు.. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా.. డీసీపీ విశాల్ గున్నీలను సీఎంవోకు పిలిచి మరీ.. జెత్వానీని అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసిన వైనం దర్యాప్తులో వెల్లడైనట్లుగా చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ భేటీకి రెండు.. మూడు రోజుల ముందే కుక్కల విద్యాసాగర్ ను సీఎంవోకు పిలిచి.. మొత్తం వ్యూహాన్ని వివరించినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలు జరిగిన సమయంలో అందరి టవర్ లొకేషన్లు ఒకేచోట చూపించిన టెక్నికల్ ఎవిడెన్సును అధికారులు సేకరించారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సీఎంవోకు పిలిచిన సకల శాఖా మంత్రి.. ‘‘ఇది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులకు సంబంధించిన ఇష్యూ. చాలా సీక్రెట్ గా నిర్వహించాలి. అందుకు మీకు అప్పగిస్తున్నాం. మీకేం కావాలో మేం చూసుకుంటాం’’ అంటూ స్పష్టంగా చెప్పారని.. ఈ కారణంతోనే తాము తలదూర్చాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద చర్యలకు గురైన ఒక పోలీసు ఉన్నతాధికారి వాపోయినట్లుగా పేర్కొన్నారు.
ఆయన్ను విచారిస్తే జనవరి 31న సీఎంవోలో ఏం జరిగింది ? ఎవరి పాత్ర ఏమిటి? అసలు సూత్రధారులు ఎవరు? లాంటి కీలక అంశాలు వెలుగు చూసే వీలుందని చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గత ప్రభుత్వంలోని సీఎంవోలో చక్రం తిప్పిన కీలక సలహాదారు.. అన్నీ తానై చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారిని నిందితులుగా చేర్చే వీలుందని చెబుతున్నారు. కాదంబరి టాస్కులో కీలకభూమిక పోషించిన అధికారులకు దఫాలుగా భారీ మొత్తాల్లో సొమ్ములు అందినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఆధారాల్ని సేకరించే ప్రయత్నంలో పోలీసు అధికారులు ఉన్నారు. ఏమైనా.. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని సంచలనాలకు ఈ కేసు కేరాఫ్ అడ్రస్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.