స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును 2 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 3 రోజుల పాటు సీఐడీ కస్టడీకి అడగగా..2 రోజులు మాత్రమే అనుమతించింది. అంతేకాదు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును విచారణ చేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.00 వరకు విచారణ జరపాలని వెల్లడించింది. మరోవైపు, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో, క్వాష్ పిటిషన్ డిస్మిస్ ను సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లు నిర్ణయించారు.
సీఐడీ కస్టడీకి ఇస్తున్న సందర్భంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీ అధికారులకు 3 షరతులు విధించారు. విచారణ పూర్తయిన తర్వాత చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపరచాలని చెప్పారు. విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. విచారణ అధికారుల జాబితా ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు, విచారణకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు లీక్ కాకూడదని తీర్పులో పేర్కొంది. చంద్రబాబును జైల్లో విచారణ జరుపుతారని సీఐడీ తరపు న్యాయవాదులు చెప్పడంతో దానికి న్యాయమూర్తి అంగీకరించారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని కోర్టు చెప్పింది.
మరోవైపు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయి అని, విచారణ జరిపి మరిన్ని వివరాలు రాబట్టాలని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు ఈ నెల 26న విచారణ జరపనుంది. అంగళ్లు కేసులోను చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది.