జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై కొంతకాలంగా హైకోర్టులో విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. న్యాయమూర్తులపై, న్యాయస్థానాలపై అనుచిత పోస్టులను పెట్టిన కేసు విచారణలో ట్విట్టరుపై కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని చట్టాలు, న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వస్తుందని ట్విట్టర్ కు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. జడ్జిలపై ట్విట్టర్ లో కొందరు పెట్టిన పోస్టులు డిలీట్ చేసినప్పటికీ…అవి మరలా వస్తున్నాయని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
దీంతో, ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ట్విటర్..తాజాగా జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇకపై, జడ్జిలపై వ్యాఖ్యలు ట్విటర్ లో కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, అఫిడవిట్లో చెప్పిన విషయాలు నిజమో కాదో చూడాలని సీబీఐని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు, మెమో దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ మరో రెండు వారాలకు వాయిదా వేసింది.
గత విచారణ సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్ ఫాంల తీరుపై హైకోర్టు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అభ్యంతరకర పోస్టుల తొలగింపు వ్యవహారంలో ఆ ప్లాట్ ఫాంలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని అసహనం వ్యక్తం చేసింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను తొలగించాలని సీబీఐ కోరినప్పటికీ 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ లను నిలదీసింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు ఆయా సంస్థలు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని ఆక్షేపించింది. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని,కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ట్విటర్ అఫిడవిడ్ దాఖలు చేసింది.