నొప్పించిక తానొవ్వక తప్పించుకు తిరుగుదామని పాలక పార్టీల కోసం ప్రజాసమస్యలు వదిలేసి, ప్రతిపక్షాలను చీల్చి చెండాడి బొక్క బోర్లా పడింది తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9. పడిన తర్వాతే తెలిసొచ్చినట్టుంది యాజమాన్యానికి. అగ్రస్థానం కోల్పోతే సూటిపోటి మాటలు పడటం అంతే కష్టం అనుకుంటా. సహజంగానే నెంబర్ వన్ వచ్చిన ఛానల్ వేసే ప్రొమోలు.. వాళ్లు చేసుకునే ప్రచారం దాదాపు 18 ఏళ్లు అప్రతిహతంగా నిలబెట్టుకున్న అగ్రస్థానం నుంచి అడుగు దిగని ఛానల్ లో అసహనఛాయలు సహజం.
ఎదుటి వాళ్లు రెచ్చగొట్టే మాటలు మరింత ఆత్మరక్షణలో పడేస్తాయి. మరి నేషనల్ మీడియా తరహాలో టీవీ9 కూడా ఈ పోటీ రొచ్చులోకి దిగుతుందా లేక లేక హుందాగా స్వీకరించి నెంబర్ వన్ కోసం తనను తాను మార్చుకుంటుందా అన్న చర్చ జరిగింది. ఛానల్ మార్పునే కోరుకుంటుంది అనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పినట్టు ఓ హఠాత్పరిణామం ఛానల్లో చేంజ్ తీసుకొచ్చింది. మళ్లీ తన పాత పద్దతిలోకి వస్తోంది. ఏది ఏమైనా నెంబర్ వన్ గా ఉండటం ఎంత అవసరమో గుర్తించి అడుగు వేస్తున్నట్టుగా ఉంది.
మరక మంచికేనా?
జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు. కానీ జరగబోయేదాన్ని మనకు అనుగుణంగా మలుచుకోవడం అవసరం. టీవీ9 కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. దెబ్బ తగిలితే కానీ తత్వం బోధపడలేదని లోపాలు గుర్తించి మార్పులు చేసుకుంటోంది. పోయిన దాని గురించి బాధపడటం అంటే మూర్ఖత్వం అవుతుంది. ఈ విషయం ఛానల్ బరువు భుజానికి ఎత్తుకున్న రజనీకాంత్ కు అర్థమయి ఉంటుంది.
ఇంతకాలం రేటింగ్ లేదు కాబట్టి మనం వేసింది వార్త. చెప్పిందే న్యూస్ అని భావించారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీపై నెగిటివ్ వార్తలు వేసుకుని అటు జగన్, ఇటు కేసీఆర్ కు భజన కాలక్షేపం అన్నట్టుగా సాగింది ఛానల్. ఫలితం వస్తేకానీ పరీక్షలో మనవాడి సత్తా ఏంటో తెలియదన్నట్టు ఇప్పుడు రేటింగ్స్ దెబ్బకు రజనీకాంత్ గేమ్ ఛేంజ్ చేసినట్టుగా బుల్లి తెరమీద కనిపిస్తోంది. భజనకు దూరంగా యాంటీ గవర్నమెంట్ వార్తలకు చోటు కల్పిస్తే.. ప్రజాసమస్యలపై ఫోకస్ పెంచారు. తెలంగాణలో వీధి కుక్కల నుంచి ఏపీలో ఆంబులెన్స్ మాఫియాల దాకా అటు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, విపక్షాల ఆందోళనకు స్క్రీన్ టైమ్ పెరుగుతోంది.
ఏపీలో ఛానల్ మూడ్ మారిందా?
ఇంతకాలం విపక్షాల వాయిస్ కంటే అధికారపార్టీ యాంగిల్ లోనే కథనాలు వండివార్చిన టీవీ9లో కొద్దిరోజులుగా మార్పు కనిపిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బైట్ వినపడటమే అరుదుగా కనిపించేది. అవసరం అయితే తప్ప టీడీపీ నేతల బైట్స్ వాడేవారు కాదు. కానీ టీవీ9లో ఇప్పుడు ఏకంగా లైవ్ లు గంటలకు గంటలు ఇస్తున్నారు. రీసెంట్ గా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఘటన మిగతా ఛానల్స్ కంటే వేగంగా స్పందించింది. లోకేష్ పీసీ లైవ్ నాన్ స్టాప్ కవరేజి ఇచ్చింది.
అంతేనా అంతకు ముందు బొండా ఉమ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత చేసిన ఆందోళన కవరేజిలో మిగతా ఛానల్స్ కు ఛాన్స్ లేకుండా విపరీతమైన స్కోర్ చేసింది. వాస్తవానికి రెండేళ్లుగా టీడీపీ నేతలు టీవీ9 ఛానల్ ను బ్యాన్ చేశారట. డిస్కషన్లు కూడా వెళ్లడం లేదు. నీలిమీడియా ముద్ర వేసి సైడ్ చేశారు. కేడర్ కు కూడా ఎవరూ చూడొద్దని సందేశాలు పంపినట్టు తెలుస్తోంది. దీంతో ఛానల్ రేటింగ్ పడిపోవడానికి కారణాల్లో ఇదొకటి అని భావించినట్టుంది. అందుకే వ్యూహం మార్చింది.
రేటింగ్ రానంతవరకూ ఓకే కానీ.. వెనకబడ్డ తర్వాత ఛానల్ ముఖ్యం అనుకున్న టీవీ9 ప్రభుత్వ వ్యతిరేక వార్తలను కూడా బలంగా ప్రసారం చేస్తోంది. లేటెస్టుగా క్రెడాయ్ సదస్సులో కేటీఆర్ ఏపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ముందుగా పసిగట్టి ప్రసారం చేసింది టీవీ9. ఈ ఛానల్ వార్తనే తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్, లోకేష్ ట్రోల్ చేశారు. ఓ రకంగా ఇంతకాలం టీవీ9 మోసిన జగన్ కు, వైసీపీకి టీవీ9లో మార్పు షాకింగే.
ఇదే కాదు పొలిటికల్ మిర్చిలో వైసీపీఎమ్మెల్యేలను ఉతికి ఆరేస్తోంది ఛానల్. ఇటీవల మంత్రివర్గ అసమ్మతి కవరేజిలో టీవీ9 మిగతా ఛానల్స్ ను అందనంత ఎత్తులో ఉంది. ఇంతకాలం జగన్ కు టీవీ9 అనుకూలంగా ఉండటంతో ఎలాంటి సెగ తాకలేదు. అంతా సాఫీగా ఉందనిపించింది.
కానీ మంత్రి వర్గ విస్తరణలో అసమ్మతి వార్తల దగ్గర నుంచి టీవీ9 పెంచిన దూకుడుతో నిన్నటి అంబులెన్స్ మాఫియా, కేటీఆర్ వ్యాఖ్యల దాకా తాడేపల్లి కార్యాలయంలో కలవరం మొదలైందట. అమరావతి విషయంలోనూ టీవీ9 వ్యూహం మార్చినట్టుంది. ఒకప్పుడు ప్రభుత్వ వ్యతిరేకవార్తలకు కేరాఫ్ అని ముద్ర ఉన్న టీవీ9 మళ్లీ ఏపీలో వచ్చేసినట్టేనా. జగన్ కూడా మీడియా అధినేతగా టీవీ9 బాధను అర్థం చేసుకుని ఏమీ అనలేని స్థితి. అడగలేని పరిస్థితి. ఎవరికైనా ఛానల్ ముఖ్యం.
తెలంగాణలోనూ షాకింగ్ ఛేంజ్?
ఇటీవల కేటీఆర్ ఇంటర్వ్యూ ఆధారంగా చేసుకుని మూడు రోజులు నాన్ స్టాప్ గా విపక్షాలను ఆడుకుంది టీవీ9. సడన్ గా తాండూరులో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డిల మధ్య వార్ పీక్ లోకి తీసుకెళ్లింది. ఇక మెదక్ జిల్లాలో ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెడుతున్న వార్తలు, వీధికుక్కల సమస్య వంటి వాటిపై క్యాంపెయన్ స్టోరీలతో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అటు టీవీ9లో రేవంత్ రెడ్డి వార్తలు కనిపించసాగాయి. అంతేనా కేటీఆర్ ను ఇరుకునపెట్టేలా క్రెడాయ్ వార్తను అందుకుని నానా యాగి చేసింది ఛానల్. టీవీ9 ఛానల్ యాజమాన్యం మైహోం కు, రేవంత్ రెడ్డికి మధ్య కేసులున్నాయంటారు.
పీసీసీ అధ్యక్షుడిపై వ్యతిరేక వార్తలు తప్ప న్యూట్రల్ న్యూస్ కూడా వేయని ఛానల్ లో అనూహ్యంగా ఛేంజ్ కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మాటలు, షార్ప్ బైట్స్, సీఎంను తిట్టిన మాటలు యధేచ్చగా వాడుతోంది. వాస్తవానికి తెలంగాణలో రేవంత్ రెడ్డిని అభిమానించే యూత్ ఎక్కువే. బండి సంజయ్ కంటే కూడా రేవంత్ రెడ్డికి రూరల్, సిటీల్లో ఫాలోయింగ్ ఎక్కువ. రేవంత్ రెడ్డి వార్తలు ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టం గమనించినట్టుంది ఛానల్ టీవీ9.
అది గతమా?
జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ బాధపడకుండా జరిగే దాని గురించి ఆలోచిస్తే మెరుగ్గా ఫలితం ఉంటుందని అనుభవాన్ని గుణపాఠంగా మార్చుకుని ఫాలో అవుతోంది. ఈ మార్పు మాత్రం ఎవరూ ఊహించలేదు. నిజంగా వచ్చి ఉంటే యాజమాన్యానికి కష్టంగా ఉన్నా ఛానల్ కు మంచి జరుగుతుంది. ఛానల్ బాగుంటే అంతిమంగా కంపెనీకి మంచిదే. ఎందులో అడుగుపెట్టిన ప్రతిరంగంలో నెంబర్ వన్ గా ఉండాలనుకునే మై హోం గ్రూప్ కు అవసరం కూడా.
మొత్తానికి మార్పు కనిపిస్తోంది. వచ్చిన వార్తకు మసాలా దట్టింది ఆడుకున్న చానల్ మళ్లీ అదే పంథాలో కనిపిస్తోంది. యాంటీ గవర్న్ మెంట్ ఇంతకాలం మిస్ అయింది. ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. మరి టీవీ9 తన సహజత్వాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తుందా? లేక మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతుందా? మరక మంచిదా కాదా వేచి చూడాలి.