తిరుమలలో మహాద్వార దర్శనం వ్యవహారంలో టీవీ5 ఛానెల్ పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనతో పాటు తన సిబ్బంది కూడా గుడిలోకి వచ్చారంటూ టీవీ5 చానల్ దుష్ప్రచారం చేస్తోందని రోజా ఆరోపించారు. అంతేకాదు, వెళ్లి బాబు భజన చేసుకోవాలంటూ టీవీ5 ఛానెల్ ను ఉద్దేశించి రోజా షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో రోజా ఆరోపణణలకు టీవీ5 ఛానెల్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చింది.
తన తప్పును రోజా కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆధారాలతో సహా గుట్టురట్టు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలోకి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ కూడా ప్రవేశించిన దృశ్యాలను టీవీ5 ఛానెల్ ప్రసారం చేయడంతో రోజాకు షాక్ తగిలింది. ఈ వ్యవహారంపై టీటీడీ దృష్టి సారించిందని, రోజా డ్రైవర్ ను టీటీడీ విజిలెన్స్ వర్గాలు విచారణ జరుపుతున్నాయని టీవీ5 చానల్ వీడియో ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. అంతేకాదు, సంప్రదాయ దుస్తులు లేకుండానే ఆ డ్రైవర్ ఆలయంలోకి ప్రవేశించినట్లు వీడియోను ప్రసారం చేసింది. దీంతో, రోజాకు షాక్ తగిలినట్లయింది.
అంతకుముందు, టీవీ5 న్యూస్ చానల్ పై రోజా నోటికొచ్చినట్లు మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తాయి. “పైసల కోసం బాబు భజన చేస్కో టీవీ5 చానల్. ఎదుటివాళ్ల మీద బురద చల్లకు… తిరిగి అది నీమీదే పడుతుంది. ఇవాళ ఏ న్యూస్ లేక ఎంత దిగజారిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తుందో అందరూ గమనించాలి. మొన్న తిరుపతిలో వైఎస్సార్ వాహన పథకంలో ట్రాక్టర్లు ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తే, ఎప్పుడో టీడీపీ సభ నాటి ఖాళీ కుర్చీల క్లిప్పింగ్ వేశారు.
ఇవాళ తిరుమలలో నేనొక్కదాన్నే మంత్రి హోదాలో మహాద్వారం గుండా దర్శనానికి వెళితే మా గన్ మన్ కూడా వచ్చారని స్క్రోలింగ్ వేశారు. ఇది దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఎందుకంటే అలాంటి తప్పులు మావాళ్లెప్పుడూ చేయరు. నేను కూడా అలాంటి తప్పులు చేయనని మీరు గమనించాలి’’ అంటూ రోజా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.