తెలంగాణలో సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వర రావు దారెటు? ఇప్పుడు ఇక్కడి రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు దేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి తుమ్మలకు.. ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన.. ఇప్పుడు తన అడుగులు ఎటువైపు వేస్తారనే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆయన అనుచరులు సమావేశం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. తమ నాయకుడికి టికెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్‌పై వీళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని భరోసానిచ్చారు.
తుమ్మల మొత్తం అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. 2016 పాలేరు ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ 2018లో పాలేరులో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో తుమ్మల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా టికెట్‌పై ఆశతో ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్నారని టాక్. కానీ ఇప్పుడు ఉపేందర్ రెడ్డికే కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో తుమ్మల ఏం చేస్తారో చూడాలి.
బీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఇతర అవకాశాల కోసం తుమ్మల ఎదురు చూస్తారా? అన్నది ఇక్కడ ప్రశ్న. లేదా పాలేరులో బలంగా ఉన్న కాంగ్రెస్‌లో చేరతారా? అన్నది చూడాలి. ఒకవేళ కాంగ్రెస్‌లో ఆయన చేరినా టికెట్ వస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే తన పార్టీ వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు సిద్ధమైన షర్మిల.. పాలేరు టికెట్ ఆశిస్తున్నారని తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. మరోవైపు బీజేపీలో చేరదామా? అంటే ఆ పార్టీలో అక్కడ బలం లేదు. సొంత బలం మీదే తుమ్మల ఆధారపడాల్సి ఉంటుంది. మరి తుమ్మల మనసులో ఏముందో తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.