తెలంగాణలో నవంబర్ 3న జరగబోతున్న మునుగోడు ఉపఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. మునుగోడులో విజయం సాధించేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్, సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక. మునుగోడులో తమకున్న ఓటు బ్యాంకును కాపాడుకొని మరోసారి ఇక్కడ విజయం సాధించాలని కాంగ్రెస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది.
అయితే, ఈ మూడు పార్టీలే కాకుండా టిడిపి కూడా మునుగోడు బరిలోకి దిగే అవకాశాలున్నాయని కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. మునుగోడులో టీడీపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ లేదా మరొకరికిని బరిలోకి దించాలని టిడిపి కూడా భావించినట్టు ప్రచారం జరిగింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా టీటీడీపీ నేతలు ఈ విషయంపై చర్చించారు. అయితే, స్థానిక నేతలు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసే వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకుందామని వారితో చంద్రబాబు చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా మునుగోడు ఉప ఎన్నికల బరిలో టిడిపి నిలవడం లేదని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు బక్కిన నరసింహులు అధికారికంగా ప్రకటించారు. ఈ బైపోల్ లో పోటీ చేయడం కంటే నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని నిర్ణయించామని నరసింహులు చెప్పారు. తెలంగాణ టిడిపికి చెందిన కీలక నేతలు, మునుగోడుకు చెందిన క్షేత్రస్థాయి నేతలతో చర్చించామని అన్నారు.
ఆ చర్చల తర్వాతే మునుగోడు ఉపఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని నరసింహులు తన ప్రకటనలో వెల్లడించారు. శుక్రవారంతో ఈ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో, గురువారం నాడు టిడిపి అభ్యర్థి ఎవరు అన్న సస్పెన్స్ వీడుతుందని అంతా భావించారు. ఈ క్రమంలోనే ఈ బైపోల్ లో టిడిపి పోటీ చేయడం లేదని నరసింహులు ప్రకటించారు.