ఏపీలో గత రెండేళ్లుగా అమరావతి రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువతీ యువకులు, ఎన్నారైలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయిన్పటికీ అమరావతిపై జగన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు రాష్ట్రవ్యాప్తంగా మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర తిరుపతిలో నేడు ముగియనుంది.
దాదాపు 44 రోజుల పాటు దాదాపు 400 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ పాదయాత్ర నేడు తుది ఘట్టానికి చేరుకుంది. అయితే, తిరుపతిలోని అలిపిరి వద్ద ఈ యాత్ర ముగింపు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రైతులకు అనుమతి లభిస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి రైతులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీవారి దర్శనానికి పాదయాత్ర చేస్తున్న రైతులందరినీ అనుమతించింది.
అంతేకాదు, కేవలం రేపు ఒక్కరోజే 500 మంది రైతులు ఒకేసారి స్వామివారి దర్శనం చేసుకునేందుకు కూడా అనుమతిచ్చింది. అయితే, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ దర్శనం చేసుకోవాలని రైతులకు టీటీడీ సూచించింది. రేపు వీరంతా శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మరోవైపు, పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 17న తిరుపతిలో రైతులు బహిరంగసభ నిర్వహించాలని సంకల్పించారు. అయితే, ఆ సభకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో, అనుమతి కోరుతూ వారంతా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.