టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళికి మూడు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 26న తన పెళ్లికి ఆహ్వానించేందుకు పెళ్లి పత్రికలు పంచుతుండగా చంద్రమౌళి హఠాత్తుగా కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చంద్రమౌళి గత 3 రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే, మల్టిపుల్ ఆర్గాన్ సపోర్ట్ మీద ఉన్న చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు నిన్న చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు తెల్లవారుఝామున చంద్రమౌళి తుది శ్వాస విడిచారు.
నిపుణులైన వైద్యుల బృందం చంద్రమౌళిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసిందని, అయినా సరే ఆయన ప్రాణాలను కాపాడలేకపోయామని వైద్యులు వెల్లడించారు. బుధవారం ఉదయం 8.20కి చంద్రమౌళి మరణించినట్లు కావేరి ఆసుపత్రి యాజమాన్యం ధృవీకరించింది. మరో 5 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడి మరణంతో ఇటు ధర్మారెడ్డి కుటుబంతోపాటు, వధువు కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముంబైలో ఉద్యోగం చేస్తూ, సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న చంద్రమౌళికి ఇటీవలే చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమయింది. మరి కొద్దిరోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ధర్మారెడ్డి తీవ్ర విషాదానికి లోనయ్యారు. ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులో జైలు శిక్ష పడడం, స్టే కూడా రాకపోవడంతో ధర్మారెడ్డి వృత్తిపరంగా ఇబ్బందిపడుతున్న సంగతి తెలిసిందే.