టీటీడీ ఈవో ధర్మారెడ్డి కి హైకోర్టు నెలరోజుల సాధారణ జైలు శిక్ష విధించిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే విషయంలో కోర్టు ధిక్కరణకు పాల్పడిన ధర్మారెడ్డికి న్యాయస్థానం 2 వేల జరిమానాతోపాటు జైలు శిక్షతో విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే విధించడంతో ధర్మారెడ్డికి ఊరట లభించినట్లయింది.
అయితే, ఆ వ్యవహారం నుంచి తేరుకుంటున్న తరుణంలో ధర్మారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 26న పెళ్లి చేసుకోబోతోన్న ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి హఠాత్తుగా గుండెపోటుకు గురికావడంతో ఆయన కుటుంబం కలవరపాటుకు గురైంది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చంద్రమౌళి చికిత్స పొందుతున్నారు. ముంబైలో ఉద్యోగం చేస్తున్న చంద్రమౌళి సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. తన పెళ్లి పత్రికలు పంచుతుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త ఏజే శేఖర్ రెడ్డి కూతురితో చంద్రమౌళి వివాహం నిశ్చయమయింది. వచ్చే నెలలో వీరి వివాహం తిరుమలలోనే జరగాల్సి ఉంది. అయితే, చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి గురించి కావేరీ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చంద్రమౌళికి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని, ఆసుపత్రికి తీసుకువచ్చిన వెంటనే ఆయనకు సీపీఆర్ చేసి స్టెంట్ వేశామని చెప్పారు. మల్టిపుల్ ఆర్గాన్ సపోర్ట్ మీద ఉన్న చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సంచలన ప్రకటన చేశారు. చంద్రమౌళి కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు.