కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పెద్దఎత్తున హిందు ధర్మ ప్రచార కార్యక్రమాలను అమలు చేయబోతున్నట్లు టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ వైసీ సుబ్బారెడ్డి చెప్పారు. అలాగే కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో నిర్మించలేకపోయిన 500 దేవాలయాలను తొందరలోనే నిర్మించబోతున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా 13 కల్యాణమండపాలను కూడా నిర్మిస్తామని చెప్పారు.
టీటీడీ ట్రస్టు బోర్డు నిర్ణయాల్లో హిందు దర్మ ప్రచారం చేయటం మినహా మిగిలిన రెండు కూడా అనవసరంగా నిధులు వృధా చేయటమే అనే విమర్శలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాంతాల్లో 500 దేవాలయాల నిర్మాణమంటే ఎన్ని వందల కోట్లు ఖర్చవుతుందో ఎవరైనా అంచనా వేసుకోవచ్చు. నిజానికి వందలాది కోట్ల రూపాయలు పెట్టి 500 దేవాలయాలను నిర్మించాల్సిన అవసరం ఉందా ?
ఇప్పటికే రాష్ట్రంలో వేలాది దేవాలయాలున్నాయి. వాటిలో అత్యధికం దిక్కు మొక్కు లేకుండా పడున్నాయి. కొత్త దేవాలయాలను కట్టేబదులు ఇలాంటి దేవాలయాలను స్వాధీనం చేసుకుని ఇప్పటికే ఉన్న పూజారులకు జీతబత్యాలు ఏర్పాటు చేయటం, భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే జనాలు సంతోషిస్తారు. అంతేకానీ ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లోనే దేవాలయాలను కట్టడం వల్ల నిధుల భారం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఇక కల్యాణమండపాల నిర్మాణం కూడా అనవసరమైన ఖర్చనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన కల్యాణ్ మండపాల్లో చాలావరకు వృధాగా పడున్నాయి. ఏవో జిల్లా కేంద్రాలు, ప్రముఖ పట్టణాల్లో నిర్మించిన కల్యాణమండపాలు మాత్రమే జనాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్ల గతంలో నిర్మించిన కల్యాణమండపాల్లో చాలావరకు నిరూపయోగంగానే ఉండిపోతున్నాయి.
అలాంటి కల్యాణమండపాలను ముందుగుర్తించి ఏదో రూపంలో ఉపయోగంలోకి తీసుకొస్తే జనాలు సంతోషిస్తారు. బోర్డు సభ్యులడిగారనో లేకపోతే మంత్రులు, ఎంఎల్ఏల ఒత్తిడివల్లో కల్యాణమండపాలు నిర్మిస్తామంటే కోట్ల రూపాయల భక్తుల కానుకలను వృధా చేసినట్లే అవుతుంది. కాబట్టి నిర్మాణాలు చేసేముందు వాటి ఉపయోగంపైన కచ్చితమైన ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.