తెలంగాణ పోలీస్ బాస్ కు అనూహ్యమైన అనుభవం ఎదురైంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మీద నమోదైన పలు అభియోగాలకు సంబంధించిన తాజాగా టీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే తరహా అభియోగాలున్న అనేక కేసుల్ని నమోదు చేయటం ఏమిటని ప్రశ్నించింది. ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టాలని.. మిగిలిన కేసులను స్టేట్ మెంట్స్ గా పరిగణించాలని.. మిగిలిన అన్ని కేసుల్ని మూసేయాలని పేర్కొంది.
అంతేకాదు.. ఒకే విధమైన అభియోగాలతో ఇన్ని కేసులు నమోదు చేయటమా? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. దీంతో.. స్పందించిన తెలంగాణ హైకోర్టు.. రాష్ట్ర డీజీపీ ఈ కేసు వ్యవహారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. తీన్మార్ మల్లన్నపై 35 కేసులు నమోదు చేయగా.. అందులో 22 కేసులు హైదరాబాద్ పరిధిలోనివి కాగా మరో 13 కేసులు వివిధ ప్రాంతాలకు సంబంధించినవిగా చెబుతున్నారు.
ఈ కేసులకు సంబంధించి పీటీ వారెంట్.. వారెంట్ ఇష్యూ అయిన సమాచారాన్ని నవీన్ కు కానీ ఆయన సతీమణికి కానీ వారం వ్యవధిలో తెలియజేయాలని పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రతీకారం తీర్చుకునేలా తెలంగాణ పోలీసులు వ్యవహరించరాదని.. డీకే బసు కేసులో సుప్రీంకోర్టు నిబంధనల్ని పాటించాలని పేర్కొన్నారు. నవీన్ ను కానీ ఆయన సతీమణిని కానీ వేధింపులకు గురి చేయరాదని పేర్కొన్నారు. వీరిపై నమోదైన కేసుల విచారణకు సంబంధించి టెక్నాలజీని వినియోగించాలన్నారు. డీజీపీ వ్యక్తిగతంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్వోలను ఆదేశించాలని.. దర్యాప్తు న్యాయబద్ధంగా.. పారదర్శకంగా చేయాలని పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్నపై నమోదు చేసిన కేసుల్లో ఏడేళ్లకు మించి శిక్ష పడే నేరాల్లేవన్నారు. అందుకే సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్ 41 ఎ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేయాలన్నారు. మొత్తానికి వరుస పెట్టి కేసులు.. జైలును ఎదుర్కొంటున్న తీన్మార్ మల్లన్నకు టీహైకోర్టు ఇచ్చిన తీర్పు కాసింత ఉపశమనం కలిగించేలా చేస్తుందని చెప్పక తప్పదు.