సౌత్ ఇండియాలో మంచి నటిగా, హీరోయిన్ గా సాయి పల్లవికి మంచి పేరుందన్న సంగతి తెలిసిందే. గ్లామర్ కు పెద్ద పీట వేస్తూ..స్కిన్ షోనే నమ్ముకొని హీరోయిన్లు రాణిస్తున్న ఈ కాలంలో సాయి పల్లవి కేవలం తన అందం, అభినయం, నటన, డ్యాన్స్ లతో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. ఇక, తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అయితే ఈ హైబ్రిడ్ పిల్లకు ఫిదా కాని కుర్రకారుండరు. సాధారణంగా వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే సాయి పల్లవి ఇటీవల కశ్మీరీ పండిట్లపై చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపాయి.
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో కశ్మీర్ పండిట్ల మారణ హోమాన్ని, గోమాంసం తరలిస్తున్నాడన్న అనుమానంతో ముస్లిం డ్రైవర్‌పై దాడి చేసి చంపడంతో పోల్చుతూ సాయి పల్లవి చేసిన కామెంట్స్‌పై హిందుత్వవాదులు మండిపడ్డారు. ఇక, సోషల్ మీడియాలో అయితే సాయి పల్లవిని రైట్ వింగ్ విపరీతంగా ట్రోల్ చేసింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే సాయి పల్లవిపై భజరంగ్ దళ్ నేతలు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
దీంతో, సాయి పల్లవిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలంటూ సాయిపల్లవి తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ నోటీసులు రద్దు చేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సాయి పల్లవి అభ్యర్థనను తిరస్కరిస్తూ ఆమె పిటిషన్‌ను కొట్టేసింది.
కాగా, విరాట పర్వం ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి హింస, నక్సలిజం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.‘‘అందరూ మంచి మనుషుల్లా ఉండాలి. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారు. మనం కూడా అలా చేయకూడదు. బాధితుల గురించి ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాలో కశ్మీర్ పండిట్లను ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు మనం దాన్ని మత సంఘర్షణలా వాటిని చూస్తే.. ఈ మధ్య ఓ ముస్లిం డ్రైవర్ తన బండిలో ఆవుని తీసుకెళ్తుండగా.. కొంతమంది అతడిని కొట్టి, జైశ్రీరామ్ అని చెప్పమన్నారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఎక్కడ ఉంది..? మనమంతా మంచి మనుషులుగా ఉండాలి. అప్పుడే ఐక్యత ఉంటుంది’’ అని చెప్పింది.
Comments 1