ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిశంసన తీర్మానం వీగిపోయింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సంధించిన అభిశంసన తాజాగా వీగిపోయింది. ఈ తీర్మానం 57-43 ఓట్ల తేడాతో తేలిపోయింది. నాలుగు రోజుల పాటు విచారించిన సెనేట్ చివరకు ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని.. కేపిటల్ హిల్ భవనం ముట్టడిలో ఆయనకు సంబంధం లేదని తేలింది. అభిశంసన తీర్మానం వీగిందో లేదో.. ట్రంప్ వెంటనే స్పందించారు.
అసలుసిసలు రాజకీయ ఉద్యమం ఇప్పుడే ప్రారంభమైందన్న ట్రంప్.. ‘అమెరికా గ్రేట్ ఎగైన్ కోసం చారిత్రాత్మక.. దేశభక్తితో కూడిన అందమైన ఉద్యమం ఇప్పుడు ప్రారంభమైంది. దేశ చరిత్రలోనే ఇది మరోఅధ్యాయం’ అని పేర్కొన్నారు. సత్యాన్ని.. న్యాయాన్ని సమర్థిస్తూ తన కోసం పని చేసిన లాయర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
మన ముందు ఇంకా చాలా పని ఉందని.. త్వరలో ప్రకాశవంతమైన.. అపరిమితమైన అమెరికన్ భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమం ద్వారా కలుద్దామన్నారు. వంద మంది సభ్యులు ఉన్న సెనెట్ లో ట్రంప్ అభిశంసనకు వ్యతిరేకంగా 57 మంది ఓటు వేస్తే.. అనుకూలంగా 43 మంది ఓటు వేశారు. దీనికికారణం సెనెట్ లో రిపబ్లికన్లకు పట్టు ఉండటమే. అయితే.. మొత్తం రిపబ్లికన్లలో ఏడుగురు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటం గమనార్హం. అభిశంసనకు 67 ఓట్లు రావాల్సి ఉంది.
అభిశంసన ద్వారా ట్రంప్ అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. అధ్యక్ష పదవీ కాలంలో రెండుసార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా నిలిచారు. అంతేకాదు.. పదవీ విరమణ తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంపే కావటం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అభిశంసన తీర్మానం వీగిపోయినంతనే ఆయన చేసిన ప్రకటన చూస్తే.. రానున్న రోజుల్లో అమెరికా రాజకీయాలు నిమ్మళంగా.. సాఫీగా సాగే సూచనలు కనిపించటం లేదని చెప్పక తప్పదు.